Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు ఘోర పరాజయం తప్పదా?.. మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఊహించని షాక్
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాబోయే మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురుకాబోతోందనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Donald Trump
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాబోయే మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురుకాబోతోందనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ఆక్సియోస్ అందించిన వివరాల ప్రకారం.. ఈసారి రిపబ్లికన్ పార్టీ తన మెజారిటీని కోల్పోయి, డెమోక్రాట్లు ఆధిపత్యం సాధించబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఐదు సీట్ల ఆధిక్యంతో ఉన్న రిపబ్లికన్ పార్టీ, ఈసారి ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. తాజా అంచనాల ప్రకారం విపక్ష డెమోక్రాట్లు అదనంగా 10 సీట్లు సాధించి, ఏకంగా 230 స్థానాల్లో జయకేతనం ఎగురవేయబోతున్నారు. మరోవైపు అధికార రిపబ్లికన్ అభ్యర్థులు కేవలం 205 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హౌస్‌లో రిపబ్లికన్లకు 218 మంది ఎంపీల బలం ఉండగా, డెమోక్రాట్లకు 214 మంది సభ్యులు ఉన్నారు. ఈ గణాంకాలు తలకిందులైతే ట్రంప్ సర్కారుకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది.
మిడ్‌టర్మ్ పోరు ఎంత కీలకమంటే?
అమెరికా పార్లమెంట్ వ్యవస్థలో కాంగ్రెస్, సీనెట్ అనే రెండు దిగువ, ఎగువ సభలు ఉంటాయి. అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా, కీలకమైన విదేశాంగ విధానాలు లేదా బడ్జెట్ బిల్లులు ఆమోదం పొందాలంటే ఈ రెండు సభల ఆమోదం తప్పనిసరి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఉన్న మొత్తం 435 సీట్లతో పాటు సీనెట్‌లోని మూడో వంతు స్థానాలకు ఈ మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. దిగువ సభలో మెజారిటీ కోల్పోతే ట్రంప్ తన స్వతంత్ర నిర్ణయాలను అమలు చేయడం ఏమాత్రం సాధ్యపడదు. ప్రతి బిల్లు కోసం విపక్షాల ముందర తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇరాన్ యుద్ధం తెచ్చిపెట్టిన ముప్పు
ట్రంప్ జనాదరణ దారుణంగా పడిపోవడానికి ఇరాన్‌తో ముదిరిన యుద్ధ వాతావరణమే ముఖ్య కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాథమికంగా ఈ యుద్ధాన్ని చాలా వేగంగా ముగింపుకు తీసుకురావచ్చని ట్రంప్ అంచనా వేశారు. ఇరాన్ తిరగబడి సుదీర్ఘ పోరాటానికి దిగడంతో పరిణామాలు తలకిందులయ్యాయి. ఈ సుదీర్ఘ పోరు అమెరికా పౌరుల్లో అసంతృప్తిని పెంచేసింది. దీని ప్రభావం నేరుగా రాబోయే పోలింగ్‌పై పడనుంది. దేశీయంగా ఆర్థిక భారాలు పెరగడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు రావడం ట్రంప్‌ను ఇరకాటంలో పడేశాయి.
నియోజకవర్గాల పునర్విభజన ఆదుకోగలదా?
మరోవైపు ఓటమి నుంచి గట్టెక్కడానికి రిపబ్లికన్ పార్టీ అన్ని దారులనూ వెతుకుతోంది. నియోజకవర్గాల పరిసీమనం ద్వారా కొన్ని స్థానాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ పరిసీమనం వల్ల దాదాపు తొమ్మిది సీట్ల వరకు అదనంగా లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ కసరత్తు కూడా డెమోక్రాట్ల వైపు వీస్తున్న గాలిని అడ్డుకోలేకపోతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.




