భద్రతా వలయాన్ని దాటాడు.. అమెరికా యుద్ధ విమానాన్నే టార్గెట్ చేశాడు
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక వ్యవస్థల్లో ఒకటిగా పేరున్న అమెరికాకు ఊహించని పరిణామం ఎదురైంది. ఐర్లాండ్‌లోని షానన్ విమానాశ్రయంలో..
US Military C 130
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక వ్యవస్థల్లో ఒకటిగా పేరున్న అమెరికాకు ఊహించని పరిణామం ఎదురైంది. ఐర్లాండ్‌లోని షానన్ విమానాశ్రయంలో అమెరికా సైన్యానికి చెందిన భారీ రవాణా విమానం ఓ వ్యక్తి దాడికి గురైంది. ఎలాంటి భారీ ఆయుధాలు లేకుండానే విమానంలోకి చొరబడిన ఓ వ్యక్తి.. దాని కీలక వ్యవస్థలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేశాడు. సుమారు రూ.560 కోట్ల విలువైన సీ-130 హెర్క్యూలస్ విమానాన్ని తీవ్రంగా దెబ్బతీశాడు. నవంబర్ 11న చోటుచేసుకున్న ఈ ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
నకిలీ పేరుతో భద్రతా వలయంలోకి..
ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని 48 ఏళ్ల డైథీ ఓకొర్రిన్‌గా అధికారులు గుర్తించారు. డేవిడ్ కరన్ అనే నకిలీ పేరుతో విమానాశ్రయంలోని భద్రతా ప్రాంతంలోకి ప్రవేశించిన అతడు.. నేరుగా ట్యాక్సీవేపై నిలిపి ఉంచిన అమెరికా సైనిక విమానం వద్దకు చేరుకున్నాడు. సాధారణంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండాల్సిన ప్రాంతంలోకి అతడు ఎలా వెళ్లగలిగాడన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
విమానంలోకి చొరబడి విధ్వంసం..
విమానం వెనుక భాగంలోని తలుపుల తాళాలను పగలగొట్టి లోపలికి వెళ్లిన నిందితుడు.. తన వెంట తెచ్చుకున్న గొడ్డలి, ఇతర పరికరాలతో విధ్వంసం సృష్టించాడు. విమానంలోని విద్యుత్ వైరింగ్, హైడ్రాలిక్ పైపులు, కాక్‌పిట్‌లోని పరికరాలు, గాలి సరఫరా వ్యవస్థలను దెబ్బతీశాడు. అంతేకాదు, విమానం ఇంధన ట్యాంకుల మూతలు తెరిచి వాటిలో బాల్‌బేరింగ్స్ వేసినట్లు అధికారులు గుర్తించారు. విమానం లోపలి భాగాలకే పరిమితం కాకుండా పైభాగంలోని హాచ్ ద్వారా బయటకు వచ్చి దాని బాహ్య నిర్మాణాన్ని కూడా దెబ్బతీశాడు.
గాలియం రసాయనంతో మరింత నష్టం..
ఈ ఘటనలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం గాలియం అనే రసాయనాన్ని ఉపయోగించడం. విమానాల తయారీలో కీలకంగా ఉపయోగించే అల్యూమినియం మిశ్రమాల బలాన్ని కొన్ని పరిస్థితుల్లో గాలియం తగ్గించగలదు. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న నిందితుడు.. ఇంటర్నెట్‌లో సమాచారం సేకరించి, ప్రత్యేకంగా గాలియం క్యాప్సుల్స్‌ను ఆర్డర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. విమానంలోని సున్నితమైన వ్యవస్థలపై అతడికి అవగాహన ఉన్నట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈ దాడి ఆకస్మికంగా జరిగిన ఘటన కాదని, ముందస్తు ప్రణాళికతోనే విధ్వంసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
విమానం పైకప్పుపైనే పట్టుకున్న భద్రతా సిబ్బంది..
విమానం పైభాగంలో నిందితుడు విధ్వంసం సృష్టిస్తున్న విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు కొంతసేపు శ్రమించాల్సి వచ్చింది. చివరకు విమానం పైకప్పుపైనే అతడిని పట్టుకున్నారు. అప్పటికే విమానంలోని కీలక భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అమెరికా సైన్యానికి చెందిన సీ-130 హెర్క్యూలస్ విమానం విలువ సుమారు 60 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.560 కోట్లు) ఉంటుందని అంచనా. జరిగిన నష్టం నేపథ్యంలో ఈ విమానాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావడం సాధ్యమవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అమెరికా సైనిక రవాణాకు కీలకమైన ట్రాన్స్ అట్లాంటిక్ కేంద్రంగా ఉన్న షానన్ విమానాశ్రయంలోనే ఈ ఘటన జరగడం మరింత చర్చనీయాంశమైంది. నకిలీ గుర్తింపుతో ఓ వ్యక్తి భద్రతా వలయాన్ని దాటి సైనిక విమానం వరకు చేరుకోవడం, దానిని తీవ్రంగా దెబ్బతీయడం విమానాశ్రయ భద్రతా ఏర్పాట్లపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




