US Canada: అమెరికా-కెనడా మధ్య ముదిరిన టెన్షన్.. పెంటగాన్ కొత్త ఆదేశాల వెనుక అసలు కథ ఏంటి?

అమెరికా, కెనడా మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. కెనడాతో సైనిక సహకారాన్ని పరిమితం చేస్తూ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ రహస్య ఆదేశాలు జారీ చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.

CR Reddy
Published on: 22 Nov 2026 9:22 AM IST
US Canada: అమెరికా-కెనడా మధ్య ముదిరిన టెన్షన్.. పెంటగాన్ కొత్త ఆదేశాల వెనుక అసలు కథ ఏంటి?
X

US Canada: అమెరికా, కెనడా మధ్య సంబంధాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. పొరుగు దేశమైన కెనడాతో సైనిక సహకారాన్ని పరిమితం చేయాలని అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ అమెరికన్ పత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ అధికారులను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. గత వారం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఈ మేరకు ఒక రహస్య ఆదేశాన్ని జారీ చేసినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే ఆ ఆదేశాల్లో ఏయే సైనిక కార్యకలాపాలపై ఆంక్షలు విధించారనే పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. తాము ఆ రహస్య పత్రాన్ని నేరుగా చూడలేదని వాషింగ్టన్ పోస్ట్ స్పష్టం చేసింది.

ఈ మీడియా కథనంపై అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) ప్రతినిధి సీన్ పార్నెల్ స్పందించారు. కెనడాతో ఇకపై అమెరికా భద్రతకు నేరుగా ప్రయోజనం చేకూర్చే సైనిక ఒప్పందాలు, కార్యకలాపాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు. యావత్ అమెరికా ఖండం భద్రతను బలోపేతం చేయడం, అలాగే నాటో పట్ల తన బాధ్యతలను కెనడా సరిగ్గా నిర్వర్తించేలా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు.

కొత్త ఆదేశాలతో ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలన్నీ ఆగిపోతాయన్న ఆందోళనలకు అమెరికా తెరదించింది. రక్షణ రంగానికి సంబంధించిన నిఘా సమాచార మార్పిడి (ఇంటెలిజెన్స్ షేరింగ్) పై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. అమెరికా-కెనడా ఉమ్మడి సైనిక కమాండ్ అయిన 'నోరాడ్' (NORAD) కింద జరిగే సహకారం యథావిధిగా కొనసాగుతుంది. ఉత్తర అమెరికా గగనతలాన్ని పర్యవేక్షించి, దాడుల నుంచి రక్షించే కీలక బాధ్యతను నోరాడ్ చూస్తుంది. దీనితో పాటు నాటో కూటమి పరిధిలోని ఉమ్మడి సైనిక కార్యకలాపాలు కూడా ఎప్పటిలాగే సాగుతాయని అధికారులు తెలిపారు.

అమెరికా, కెనడా దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత మిత్రదేశాలుగా కొనసాగుతున్నాయి. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచాయి. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలపాలని ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కెనడా వస్తువులపై భారీగా టారిఫ్‌లు విధించడంతో పాటు, ఆ దేశ రక్షణ ఖర్చు చాలా తక్కువగా ఉందని విమర్శించారు. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం గత ఏడాదిగా లాటిన్ అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు సైనిక, దౌత్య వనరులను కేంద్రీకరిస్తూనే, నాటో సభ్య దేశాలన్నీ రక్షణ బడ్జెట్ పెంచాలని ఒత్తిడి చేస్తోంది.

అమెరికా రహస్య ఆదేశాల వార్తలపై కెనడా రక్షణ మంత్రిత్వ శాఖ ఆచితూచి స్పందించింది. మీడియాలో వచ్చే ఇలాంటి కథనాలపై తాము ఊహాగానాలు చేయబోమని ఆ శాఖ ప్రతినిధి టోనీ రైట్ చెప్పారు. అమెరికా, కెనడా మధ్య ఎన్నో ఏళ్లుగా బలమైన రక్షణ సహకారం ఉందని, ఉత్తర అమెరికా భద్రత కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడి ప్రయోజనాల కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. కాగా, కెనడాను అమెరికాలో విలీనం చేయాలన్న ట్రంప్ సూచనను కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఇప్పటికే పూర్తిగా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.