Oil Tanker Attack : ఓమన్ తీరంలో టెన్షన్.. 24 మంది భారతీయులున్న ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా నౌకాదళం దాడి
Oil Tanker Attack : ఓమన్ తీరంలో అమెరికా ఆంక్షలను ఉల్లంఘించిన ఒక అంతర్జాతీయ ఆయిల్ ట్యాంకర్‌పై యూఎస్ నేవీ దాడి చేసింది. నౌకలో ఉన్న 24 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
Oil Tanker Attack
Oil Tanker Attack : అంతర్జాతీయ జలాల్లో సోమవారం నాడు ఒక ఊహించని ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓమన్ దేశపు తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఎంటి మేరివెక్స్ అనే భారీ ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా నౌకాదళం దాడి చేసింది. ఈ దాడి కారణంగా సదరు నౌకలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. అయితే, అత్యంత ప్రమాదకరమైన ఈ పరిస్థితిలో నౌకలో ప్రయాణిస్తున్న 24 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడటం ఊరట కలిగించే విషయం. ఈ 24 మంది సిబ్బంది కూడా భారతీయ పౌరులే కావడం గమనార్హం. ఓమన్ స్థానిక అధికారుల సత్వర సాయంతో వీరందరినీ సురక్షితంగా రక్షించారు.
ఆంక్షల ఉల్లంఘనే దాడికి కారణం
అమెరికా ఈ నౌకపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో అంతర్జాతీయ మీడియాకు అధికారికంగా వివరించింది. అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (OFAC) ఈ ఎంటి మేరివెక్స్ నౌకను ఇదివరకే బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఇరాన్, రష్యా దేశాల నుంచి చట్టవిరుద్ధంగా ఆయిల్ కొనుగోలు చేసి సరఫరా చేస్తున్న నౌకలపై అమెరికా నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే ఆంక్షలను బేఖాతరు చేస్తూ ప్రయాణిస్తున్న ఈ పలావ్ దేశపు ఫ్లాగ్ కలిగిన నౌకను అమెరికా టార్గెట్ చేసింది.
అమెరికా కళ్ళు గప్పేందుకు విఫలయత్నం
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆయిల్ ట్యాంకర్ భారతదేశానికి చెందినది కాదు. కేవలం అందులోని సిబ్బంది మాత్రమే భారతీయులు. గత కొన్ని రోజులుగా ఈ నౌక ఇరాన్ రేవుల చుట్టూ ఉన్న అమెరికా నాకేబందీ నుంచి తప్పించుకోవడానికి నాలుగు సార్లు ప్రయత్నించింది. మూడు సార్లు అమెరికా నేవీ హెచ్చరించడంతో వెనక్కి తగ్గిన ఈ నౌక.. నాలుగో సారి మాత్రం మొండిగా ముందుకు వెళ్ళింది. ఈ క్రమంలోనే ఓమన్ సముద్ర సరిహద్దులను వాడుకుంటూ అమెరికా కళ్ళు గప్పాలని చూసింది.
ట్రాకింగ్ డివైజ్ ఆఫ్ చేసినా దొరికిపోయారు
అమెరికా రాడార్లకు చిక్కకుండా ఉండేందుకు సదరు నౌక కెప్టెన్ తన ఓడలోని సిగ్నల్ వ్యవస్థను, ట్రాకింగ్ పరికరాలను పూర్తిగా బంద్ చేశాడు. ఇలా చేయడం వల్ల వారి ఉద్దేశాలు మంచివి కావని అమెరికా సైన్యానికి స్పష్టమైంది. దీంతో నౌకను నిలిపివేసేందుకు యూఎస్ నేవీ గాల్లోంచే అటాక్ చేసింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ట్యాంకర్ పూర్తిగా ఖాళీగా ఉంది, అందులో ఆయిల్ లేదు. ఒకవేళ ఆయిల్ గనుక ఉండి ఉంటే పెద్ద పేలుడు సంభవించి ఘోర ప్రమాదం జరిగేది.
భారత రాయబార కార్యాలయం కృతజ్ఞతలు
దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఓమన్ తీరరక్షక దళం మంటల్లో చిక్కుకున్న 24 మంది భారతీయ నావికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో ఓమన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆంక్షలు ఉల్లంఘించే నౌకలపై ఎంతటి కఠిన చర్యలకైనా వెనకాడబోమని అమెరికా ఈ దాడి ద్వారా మరోసారి స్పష్టం చేసింది.




