Watch : ఎయిర్ షోలో తృటిలో తప్పిన విషాదం.. గాలిలోనే ముక్కలైన యుద్ధ విమానాలు
Watch : అమెరికాలోని ఇడాహోలో జరిగిన ఎయిర్ షోలో రెండు యూఎస్ నేవీ ఫైటర్ జెట్లు గాలిలో ఢీకొని కూలిపోయాయి. పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదకరమైన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Fighter Jet Crash
Watch : అమెరికాలోని ఇడాహో రాష్ట్రంలో జరుగుతున్న గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్ షోలో పెను ప్రమాదం సంభవించింది. మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో వేలాది మంది ప్రజలు చూస్తుండగానే యూఎస్ నేవీకి చెందిన రెండు పవర్ఫుల్ ఫైటర్ జెట్లు గాలిలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బోయింగ్ ఎఫ్/ఏ-18ఈ/ఎఫ్ సూపర్ హార్నెట్, బోయింగ్ ఈఏ-18జీ గ్రోలర్ విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో భారీ శబ్దంతో మంటలు ఎగిసిపడటంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు.
ఎయిర్ షోలో భాగంగా రెండు యుద్ధ విమానాలు అత్యంత సమీపంలో ప్రయాణిస్తూ విన్యాసాలు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా రెండు విమానాలు ఒకదానికొకటి తగిలి మంటల్లో చిక్కుకుని వేగంగా కిందకు పడిపోయాయి. అయితే, విమానాలు నేలకూలకముందే పైలట్లు చాకచక్యంగా పారాచూట్ల సహాయంతో బయటకు దూకేశారు. ప్రత్యక్ష సాక్షులు ఆకాశం నుంచి నాలుగు పారాచూట్లు కిందకు రావడం గమనించారు. ప్రస్తుతం పైలట్లు సురక్షితంగా ఉన్నారని, వారికి ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదని సమాచారం అందుతోంది.
ఈ విమాన ప్రమాదం జరిగిన వెంటనే మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ను అధికారులు లాక్‌డౌన్ చేశారు. సహాయక చర్యలు చేపట్టేందుకు, ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఆదివారం మధ్యాహ్నం 1:20 గంటలకు ఈ ఎయిర్ షోను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. రెండు విమానాలు రన్‌వే సమీపంలోనే కూలిపోవడంతో భారీగా పొగ కమ్ముకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
US jets COLLIDE MID AIR at Gunfighter Skies Air Show
— RT (@RT_com) May 17, 2026
CRASH and EXPLODE
4 parachutes seen pic.twitter.com/GYVJDLNgGU
సాధారణంగా ఎయిర్ షోలలో విమానాలు చాలా దగ్గరగా ప్రయాణిస్తూ విన్యాసాలు చేస్తుంటాయి. ఈ క్రమంలో సెకనులో వందో వంతు కాలం అంచనా తప్పినా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని విమానయాన నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా ఉన్నప్పటికీ, ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాలిలో విమానాలు ఢీకొన్నప్పుడు వచ్చిన నిప్పురవ్వలు, మంటలు చూసి యుద్ధం జరుగుతోందేమోనని స్థానికులు భయపడ్డారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.




