US: అమెరికా భారీ వ్యూహం... రష్యా, చైనాలకు చెక్‌పెట్టే దిశగా అడుగులు
అణ్వాయుధాలను పెంచుకునేందుకు అమెరికా సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. రష్యా, చైనా నుంచి పొంచిఉన్న ముప్పును గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పెంటగాన్ వెల్లడించింది.
US: రష్యా, చైనా వ్యూహాత్మక పోటీకి చెక్ పెట్టేలా అమెరికా రక్షణ శాఖ 'పెంటగాన్' నూతన అణు వ్యూహం. కల్డ్‌వార్ తర్వాత కాలంలో అత్యంత కీలకమైన మార్పు ... చిన్నతరహా అణ్వాయుధాలపై దృష్టి... అమెరికా అధ్యక్షుడికి విశేష అధికారాలు కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పెంటగాన్ లక్ష్యం ఏమిటి? తెలుసుకుందాం.
రష్యా, చైనాల నుండి పెరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అమెరికా తన అణు వ్యూహంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ప్రాంతీయంగా లేదా యుద్ధక్షేత్రాల్లో పరిమిత పరిధిలో ఉపయోగించే "టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్" పై ప్రత్యేక దృష్టి సారించేలా తన అణు విధానాన్ని సమీక్షిస్తున్నట్లు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. కోల్డ్ వార్ ముగిసిన తర్వాత అమెరికా అణు విధానంలో రాబోతున్న అత్యంత కీలకమైన మార్పుగా ఇది నిలవనుంది.
పరిమిత అణు ప్రత్యామ్నాయాల అవసరం ... పెంటగాన్ ఆలోచన
ఈ నూతన సమీక్షా ప్రక్రియకు పాలసీ వ్యవహారాల డిఫెన్స్ అండర్ సెక్రటరీ ఎల్‌బ్రిడ్జ్ కొల్బీ నాయకత్వం వహిస్తున్నారు. నెబ్రాస్కాలోని యుఎస్ స్ట్రాటజిక్ కమాండ్ సందర్శన సందర్భంగా ఆయన ఈ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అంతర్జాతీయ సంక్షోభం తలెత్తినప్పుడు అమెరికా అధ్యక్షుడికి కేవలం సాధారణ సైనిక దాడి చేయడం లేదా భారీ స్థాయి అణు దాడికి దిగడం అనే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే కాకుండా, పరిస్థితులకు అనుగుణంగా స్పందించేందుకు వీలుగా ఈ చిన్నతరహా అణు ఆయుధాలు ఉపయోగపడతాయి. ప్రత్యర్థులకు బలమైన హెచ్చరిక పంపాలన్నా, పొడిగించిన రక్షణ హామీలు ఆచరణాత్మకంగా ఉండాలన్నా అవసరమైతే ఉపయోగించగలిగే పరిమిత అణు సామర్థ్యాలు కలిగి ఉండటం శ్రేయస్కరమని పెంటగాన్ భావిస్తోంది.
టాక్టికల్ అణు ఆయుధాలు ... వివాదం, ఆందోళనలు
సుదూర ప్రాంతాల్లోని నగరాలను ధ్వంసం చేసే వ్యూహాత్మక అణు ఆయుధాల కంటే ఈ టాక్టికల్ ఆయుధాలు తక్కువ వినాశకర రసాయనిక సామర్థ్యాన్ని కలిగి ఉండి, నిర్దిష్ట సైనిక లక్ష్యాలపై దాడికి ఉపకరిస్తాయి. అయితే, ఈ ఆయుధాల వినియోగాన్ని సాధారణ సైనిక ప్రణాళికల్లో భాగం చేయడం వల్ల అణు యుద్ధ పరిమితులు తగ్గిపోయి, అణు సంక్షోభం తలెత్తే ప్రమాదం పెరుగుతుందని కొందరు రక్షణ రంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నూతన అధ్యయనం అమెరికా అణు నిరోధక శక్తిని మరింత పెంచాలన్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన లక్ష్యాలకు భిన్నంగా ఉందనే అభిప్రాయాలు కూడా యుఎస్ కాంగ్రెస్ వర్గాల నుండి వ్యక్తమవుతున్నాయి.
ముదిరుతున్న అంతర్జాతీయ అణు పోటీ
గడిచిన కొద్ది సంవత్సరాల్లో చైనా తన అణు సామర్థ్యాన్ని వేగంగా విస్తరించుకోగా, రష్యా కూడా తన వ్యూహాత్మక అణు వ్యవస్థలను నిరంతరం ఆధునీకరిస్తోంది. ఈ ఇరు దేశాల నుండి రెండు రకాల వ్యూహాత్మక ముప్పులు ఏకకాలంలో ఎదురవుతున్న నేపథ్యంలో, అమెరికా తన రక్షణ సామర్థ్యాన్ని సాంకేతికంగా పునర్నిర్మించుకోవడం అనివార్యమని పెంటగాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే, అమెరికా, రష్యా, చైనాలు అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు వాటిమధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రపంచంలో యుద్ధపరిణామాలకు దారిస్తే... దానివలన వినాశనం తప్ప మరొకటి జరగదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




