Ukraine Russia Peace Talks: యూరప్‌లో శాంతికి అడుగులు... యూఎస్‌ ప్రయత్నం ఫలిస్తుందా?

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మాస్కో, కీవ్ చర్చలు, యూరప్ భాగస్వామ్యంతో శాంతి సాధ్యమవుతుందా?

Balachander
Published on: 7 Sept 2026 10:15 AM IST
Ukraine Russia Peace Talks: యూరప్‌లో శాంతికి అడుగులు... యూఎస్‌ ప్రయత్నం ఫలిస్తుందా?
X

Ukraine Russia Peace Talks: ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమై దాదాపు ఐదేళ్లు గడుస్తున్న వేళ, యుద్ధానికి తెరదించేందుకు అమెరికా మరోసారి దౌత్యపరమైన అడుగులు వేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్ తొలిసారిగా కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. గతంలో ఎనిమిది సార్లు మాస్కోలో చర్చలు జరిపిన ఈ బృందం, ఉక్రెయిన్ భూభాగంలోకి అడుగుపెట్టడం అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది.

మాస్కో నుంచి కీవ్ వరకు దౌత్య వేగం

ఉక్రెయిన్ పర్యటనకు సరిగ్గా ఒక రోజు ముందు అమెరికా బృందం మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మూడు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈ సమావేశం ఎంతో ఉపయోగకరంగా, పారదర్శకంగా సాగిందని క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, అమెరికా ప్రతినిధులు కీవ్ సందర్శించే సమయంలో వారి భద్రతకు తాము పూర్తి పూచీకత్తు ఇస్తామని పుతిన్ స్వయంగా ప్రకటించారు.

కీవ్‌లో కీలక సమావేశం... యురోపియన్ భాగస్వామ్యం

అమెరికా ప్రతినిధులు పోలాండ్ నుంచి రైలు మార్గంలో కీవ్ చేరుకున్నారు. ఈ చర్చల్లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు కూడా పాలుపంచుకోవడం విశేషం. ఉక్రెయిన్‌కు చెందిన లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాల ఉపసంహరణపై ఇరుదేశాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయి. భూభాగ మార్పిడి వంటి సున్నితమైన అంశాలపై తుది నిర్ణయం ఇరుదేశాల అగ్రనేతల స్థాయిలోనే సాధ్యమవుతుందని జెలెన్స్కీ స్పష్టం చేశారు.

తాత్కాలిక విరామం ... కొనసాగుతున్న దాడులు

శాంతి చర్చల నేపథ్యంలో రెండు దేశాల రాజధానులు మాస్కో, కీవ్ పై మూడు రోజుల పాటు దాడులు జరపకూడదని రష్యా, ఉక్రెయిన్ ఒప్పందం చేసుకున్నాయి. అయితే సరిహద్దు ప్రాంతాల్లో పోరాటం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఉక్రెయిన్ సైనిక మౌలిక వసతులు, డ్రోన్ స్థావరాలే లక్ష్యంగా రష్యా దాడులు చేసింది. అలాగే 400 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. ఉక్రెయిన్ వైపు 108 డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా దాడి జరిపింది. రష్యాలోని ప్రసిద్ధ రియాజాన్ ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసి భారీగా నష్టం కలిగించింది. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో రెండు దేశాలు ఇలా దాడులు జరుపుకోవడంతో ఈ చర్చలు ఎంత వరకు ఫలిస్తాయన్నది చూడాలి. ఇక ఇదిలా ఉంటే, అమెరికా ప్రతిపాదించిన నూతన శాంతి ప్రణాళిక పై స్పష్టత రావాల్సి ఉంది. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో యుద్ధం మరింత ముదిరే ప్రమాదం ఉన్నందున, అమెరికా-యూరప్ దేశాల సంయుక్త ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో రాబోయే వారాల్లో వెలువడే ప్రకటనలపై ఆధారపడి ఉంటుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story