Donald Trump: ఇరాన్‌తో శాశ్వత ఒప్పందమే లక్ష్యం.. కాల్పుల విరమణ పొడిగింపుపై ట్రంప్ 'నో'!
Donald Trump: ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.
Donald Trump: ఇరాన్‌తో శాశ్వత ఒప్పందమే లక్ష్యం.. కాల్పుల విరమణ పొడిగింపుపై ట్రంప్ 'నో'!
Donald Trump: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణిగే సూచనలు కనిపిస్తున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ (Ceasefire) గడువును పొడిగించే ఆలోచన తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. తాత్కాలిక ఊరట కంటే, ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవడమే తమ ప్రాధాన్యతని ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 21తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చర్చలు ఎలా ముగిసినా, ఒక పటిష్టమైన ఒప్పందం కుదిరితేనే ప్రపంచానికి మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
వచ్చే రెండు రోజుల్లో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ అధికారులతో అమెరికా ప్రతినిధులు భేటీ కానున్నారు. ఇరాన్‌లో గతంలో ఉన్న అతివాద ధోరణి మారిందని, ఇప్పుడు కొత్త పాలకులు వచ్చారని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొత్త పాలకులతో కలిసి పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని, ఇస్లామాబాద్ చర్చలు అద్భుతంగా సాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.




