Trump call to PM Modi: ప్రధానిమోదీకి ట్రంప్ ఫోన్.. హార్ముజ్ పై కీలక చర్చ

Trump call to PM Modi: మధ్యప్రాచ్యంలో సంక్షోభం వేళలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి కాల్ చేశారు. ఇరువురు నాయకులూ పరిస్థితిని సమీక్షించారు.

KVD Varma
Published on: 25 March 2026 8:52 AM IST
Trump call to PM Modi: మధ్యప్రాచ్యంలో సంక్షోభం వేళలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి కాల్ చేశారు
X

Trump call to PM Modi

Trump call to PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రెండు ముఖ్యమైన చర్చలు జరిపారు. మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకేలతో ఫోన్‌లో మాట్లాడారు. మొదట ట్రంప్ మోదీకి ఫోన్ చేశారు. హోర్ముజ్ జలసంధి వీరిద్దరి మధ్య చర్చనీయాంశంగా మారింది. హోర్ముజ్ జలసంధి తెరిచి, సురక్షితంగా ఉండటం ప్రపంచానికి అవసరమని మోదీ అన్నారు. శాంతి ప్రయత్నాల కోసం చర్చలను కొనసాగించడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రాంప్ ఫోన్ చేసినట్లు ప్రధాని మోదీ తన X పోస్ట్ లో వెల్లడించారు.

ప్రధాని మోదీ - ట్రంప్ చర్చలు ఇలా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యంలోని పరిస్థితిపై చర్చించారు. ఈ సమావేశంలో, హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం అవసరమని ఇద్దరు నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే, భారతదేశంతో సహా ఇతర దేశాలకు ముడి చమురు, గ్యాస్ సరఫరా ఈ ప్రాంతం నుంచే జరుగుతుంది. అందువల్ల, ఈ మార్గాన్ని తెరిచి ఉంచడంలో భారతదేశానికి కూడా పాత్ర ఉందని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారాన్ని భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు.


ఇరాన్ విద్యుత్, ఇంధన కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఇరాన్‌తో సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. అయితే, ఇరాన్ ఈ చర్చలను తిరస్కరించి, ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించింది. ఈ యుద్ధం కారణంగా, హోర్ముజ్ జలసంధి గుండా జరిగే ప్రపంచ చమురు, గ్యాస్ వాణిజ్యంలో సుమారు 20 శాతం దాదాపుగా నిలిచిపోయింది. దీనివల్ల ప్రపంచం ముందు ఒక పెద్ద సంక్షోభం తలెత్తింది. ఈ ఉద్రిక్త సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ కీలక అంశాలపై చర్చించడం గమనార్హం.

శ్రీలంక అధ్యక్షుడితో..

ట్రంప్ తర్వాత, మోదీ శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకేతో కూడా చర్చలు జరిపారు. మధ్యప్రాచ్యంలో మారుతున్న పరిస్థితులపై ఇద్దరూ చర్చించారు. ఇంధన భద్రతను ప్రభావితం చేసే అంశాల గురించి కూడా ఇద్దరు నాయకులు మాట్లాడారు.

భారత్-శ్రీలంక ఇంధన సహకారాన్ని బలోపేతం చేయడానికి, ప్రాంతీయ భద్రతను పెంపొందించడానికి జరుగుతున్న పనుల పురోగతిని కూడా మోదీ, దిస్సనాయకే సమీక్షించారు. సమావేశం అనంతరం, ఉమ్మడి సవాళ్లను పరిష్కరించేందుకు ఇద్దరూ కలిసి పనిచేస్తారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రకటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాజ్యసభలో మధ్యప్రాచ్య సంక్షోభంపై మాట్లాడారు. యుద్ధ వాతావరణంలో నౌకలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా చూసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఇందుకోసం భారత్ సంప్రదింపుల మార్గాన్ని అనుసరిస్తోందని తెలిపారు. ఈ యుద్ధం ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని సృష్టించిందని, వివిధ దేశాల నుంచి చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించి, హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడానికి భారత్ ప్రయత్నిస్తోందని తెలిపారు. అన్ని దేశాలు సంప్రదింపుల ద్వారా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నది భారత వైఖరి అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని కూడా ఆయన తెలిపారు.

యుద్ధంలో 2600 మందికి పైగా మరణించారు

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. యుద్ధం మొదలై 25 రోజులు అయ్యింది. ఈ యుద్ధంలో 2,600 మందికి పైగా మరణించారు. వీరిలో ఇరాన్‌లో సుమారు 1,500 మంది మరణించారు. లెబనాన్‌లో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 16 మంది, 13 మంది అమెరికన్ సైనికులు కూడా మరణించారు. ఈ దాడుల్లో గల్ఫ్ దేశాలకు చెందిన కొందరు పౌరులు కూడా మరణించారు.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story