H-1B visa: హెచ్‌-1బీ వీసా.. ఈ ఏడాదికి రెండో లాటరీ లేనట్లే.. యూఎస్‌సీఐఎస్‌ కీలక ప్రకటన!

H-1B visa: 2026-27 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌-1బీ వీసా కోటా భర్తీ అయ్యిందని, రెండో లాటరీ ఉండకపోవచ్చని స్పష్టం చేసిన యూఎస్‌సీఐఎస్‌.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 July 2026 6:16 AM IST
H-1B visa
X

H-1B visa: హెచ్‌-1బీ వీసా.. ఈ ఏడాదికి రెండో లాటరీ లేనట్లే.. యూఎస్‌సీఐఎస్‌ కీలక ప్రకటన!

H-1B visa: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ వృత్తి నిపుణులకు అత్యంత కీలకమైన హెచ్‌-1బీ (H-1B) వీసాలకు సంబంధించి 'అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం' (USCIS) కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన కోటా పూర్తిగా భర్తీ కావడంతో, ఈ ఏడాది రెండో లాటరీ (Second Lottery) నిర్వహించే అవకాశం లేదని స్పష్టమవుతోంది.

గడువు ముగిసింది.. స్లాట్లు భర్తీ:

అమెరికా నిబంధనల ప్రకారం ఏటా 85 వేల హెచ్‌-1బీ వీసాలను జారీ చేస్తారు. ఇందులో 65 వేల వీసాలు రెగ్యులర్‌ క్యాప్ కింద, మరో 20 వేల వీసాలను అమెరికాలో ఉన్నత చదువులు చదివిన వారి కోసం మాస్టర్‌ క్యాప్‌ కింద కేటాయిస్తారు. మొదటి విడత లాటరీలో ఎంపికైన అభ్యర్థుల తరఫున ఆయా కంపెనీలు పూర్తి స్థాయి పిటిషన్‌లను సమర్పించేందుకు ఇచ్చిన గడువు (జూన్‌ 30, 2026) ముగిసింది. ఈ గడువు నాటికే నిర్దేశిత 85 వేల వీసా స్లాట్లకు సరిపడా దరఖాస్తులు విజయవంతంగా నమోదయ్యాయని యూఎస్‌సీఐఎస్‌ ప్రకటించింది.

తగ్గిన రిజిస్ట్రేషన్ల సంఖ్య:

2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం 2.11 లక్షల హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు యూఎస్‌సీఐఎస్‌ ఇటీవల వెల్లడించింది. గత ఏడాదితో (3.43 లక్షల రిజిస్ట్రేషన్లు) పోలిస్తే ఈసారి దరఖాస్తుల సంఖ్య దాదాపు 38.5 శాతం తగ్గినట్లు పేర్కొంది. కాగా, ఈ ఏడాది వీసాలకు ఎంపికైన ఉద్యోగుల పని దినాల కాలపరిమితి అక్టోబర్‌ 1, 2026 నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది.

కొత్త విధానంలో లాటరీ ఎంపిక..?

ఇప్పటివరకు హెచ్‌-1బీ వీసాలను కంప్యూటరైజ్డ్ లాటరీ విధానంలో ర్యాండమ్‌గా (యాదృచ్ఛికంగా) ఎంపిక చేసేవారు. అయితే, ఈసారి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (DHS) ఎంపిక ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. అత్యధిక వేతనాలు మరియు ఉన్నత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు (లెవల్‌ 4 విభాగం) వీసా పొందే అవకాశాలు ఎక్కువగా ఉండేలా ప్రాధాన్యత కల్పించారు. దీనివల్ల తక్కువ వేతనం పొందే లేదా ఎంట్రీ లెవల్‌ ఉద్యోగులకు ఎంపికయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఈ నూతన ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని యూఎస్‌సీఐఎస్‌ స్పష్టం చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story