US Iran Tensions: ఆంక్షలకు భయపడం... హూర్ముజ్‌పై పట్టు వదులుకోం

పశ్చిమాసియాలో జరుగుతున్న, రోజు రోజుకు మారుతున్న పరిణామాలు ప్రపంచాన్ని నిద్రపోనివ్వడం లేదు. ఏ క్షణం ఎలాంటి మార్పులు చూడాల్సి వస్తుందోనని భయపడుతున్నారు.

Balachander
Published on: 29 April 2026 10:23 AM IST
US Iran Tensions: ఆంక్షలకు భయపడం... హూర్ముజ్‌పై పట్టు వదులుకోం
X

US Sanctions on Iran: పశ్చిమాసియాలో జరుగుతున్న, రోజు రోజుకు మారుతున్న పరిణామాలు ప్రపంచాన్ని నిద్రపోనివ్వడం లేదు. ఏ క్షణం ఎలాంటి మార్పులు చూడాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. ఇరాన్‌ను దారిలోకి తెచ్చుకోవాలని అమెరికా ఆర్థిక ఆంక్షల కొరడా ఝుళిపిస్తుంటే... ఇరాన్‌ పట్టువదలని విక్రమార్కుడిలా సవాల్‌ విసురుతోంది. ప్రపంచానికి చమురు జీవనాడి వంటి హోర్ముజ్‌ జలసంధి వేదికగా ఇప్పుడు అమెరికా వర్సెస్‌ ఇరాన్‌ మధ్య అప్రకటిత యుద్ధం తీవ్రరూపం దాల్చింది. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ ఈ ప్రాంతం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. దీంతో వాణిజ్య నౌకల రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

ఇరాన్‌పై అమెరికా 'ఎకనామిక్ ఫ్యూరీ' రహస్యం

హోర్ముజ్‌ జలసంధి నుంచి ప్రతిరోజూ 100 నుంచి 120 వరకు చమురు నౌకలు ప్రయాణిస్తుంటాయి. కోట్లాది బ్యారెళ్ల ఆయిన్‌ రవాణా జరుగుతంది. కానీ, గత రెండు నెలల నుంచి ఈ జలసంధి గుండా చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే చమురు రవాణా నౌకలు ప్రయాణిస్తున్నాయి. ఈ జలసంధిపై పట్టుకోసం అటు అమెరికా, ఇరాన్‌ మధ్య పోరు ముదిరి పాకాన పడింది. ఈనేపథ్యంలోనే ఇరాన్‌ సైనిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న షాడో బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌ను దెబ్బతీయడానికి అమెరికా సిద్ధమైంది. 35 సంస్థలు, వ్యక్తులపై కఠినమైన ఆంక్షలు విధించింది.

వణుకుతున్న ఆర్థిక మూలాలు?

అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఇరాన్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోకి అక్రమంగా ప్రవేశించి నిధులు సేకరిస్తోంది. బ్రిటన్‌కు చెందిన షుకున్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ద్వారా కేవలం చమురు లావదదేవీల కోసం 70 బిలియన్‌ డాలర్లను తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు వెయ్యికిపైగా ఇరాన్‌ అనుబంధ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ జలసంధిలో ప్రయాణించే నౌకలను ఇరాన్‌ ఆర్మి కంట్రోల్‌ చేయడం మొదలుపెట్టింది. సైన్యానికి టోల్‌ఫీజు చెల్లిస్తేనే ఆ నౌకలను వదిలేస్తామని హెచ్చరించింది. అయితే, టోల్‌ చెల్లించిన నౌకాయాన సంస్థలపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరించింది. దీంతో నౌకాయాన సంస్థలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయాయి.

ఇరాన్ దీటైన జవాబు

అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా తాము లొంగిపోయే ప్రసక్తి లేదని ఇరాన్ సైన్య ప్రతినిధి అమీర్ అక్రమినియా స్పష్టం చేశారు. "పరిస్థితి ఇప్పటికీ యుద్ధం లాగే ఉంది, మా క్షిపణి సామర్థ్యాన్ని మరింత పెంచుకున్నాం" అని ఆయన ప్రకటించడం గమనార్హం. ప్రపంచానికి అవసరమైన చమురులో దాదాపు 20% ఈ హర్మూజ్ మార్గం నుంచే వెళ్తుంది. ఇప్పుడు ఈ మార్గంపై ఇరాన్ పూర్తి నియంత్రణను ప్రకటించడం ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. తమ సార్వభౌమత్వానికి అడ్డువస్తే తగిన బుద్ది చెబుతామని ఇరాన్‌ హెచ్చరిస్తూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందానికి డెడ్‌లైన్‌ పెట్టకపోవడంతో ఈ పరిస్థితులు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితి.

సామాన్యుడిపై ప్రభావం ఏమిటి?

పట్టుకోసం రెండు దేశాలు చేస్తున్న రగడ కారణంగా ప్రపంచ దేశాల్లో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఆంక్షల వలన ఇరాన్‌ విమానయాన సంస్థలకు ఇంధనం, ల్యాండింగ్‌ సౌకర్యాలు కల్పించవద్దని ఆదేశించడం వలన అంతర్జాతీయ ప్రయాణాలు కూడా భారమయ్యే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్‌ వేదికగా జరిగిన శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఈ ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయో అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందో లేదో కూడా తెలియదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story