US-Saudi Nuclear Deal: సౌదీతో అమెరికా న్యూక్లియర్ డీల్... గల్ఫ్‌లో హైటెన్షన్
అమెరికా సౌదీ అరేబియా మధ్య న్యూక్లియర్ డీల్ కుదరడంపై సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్ వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ డీల్ మరింత టెన్షన్‌కి గురిచేసే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
US-Saudi Nuclear Deal: పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరిన వేళ, సౌదీ అరేబియాతో అమెరికా చారిత్రాత్మక సివిల్ న్యూక్లియర్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందం ద్వారా సౌదీ అరేబియా తన సొంత భూభాగంలోనే యురేనియంను శుద్ధి చేసుకునేందుకు దారి సుగమం కానుండటమే ఇందుకు ప్రధాన కారణం.
అమెరికా వ్యూహం ... ఒప్పందంలోని కీలక అంశాలు
అమెరికా ఇంధన శాఖ కథనం ప్రకారం, ఇది దశాబ్దాల పాటు కొనసాగే అణు రక్షణ ఒప్పందం. దీని ద్వారా అమెరికా కంపెనీలకు బిలియన్ డాలర్ల ఆర్థిక ప్రయోజనాలు సమకూరనున్నాయి. అమెరికా ఇప్పటివరకు ఏ ఇతర దేశానికి తమ భూభాగంలో స్వయంగా యురేనియం శుద్ధి చేసుకునే సాంకేతిక అవకాశాన్ని ఇవ్వలేదు. 2009లో యూఏఈతో కుదుర్చుకున్న ఒప్పందంలో కూడా యురేనియం శుద్ధిపై కఠిన ఆంక్షలు విధించింది. అయితే, ఇరాన్‌తో యుద్ధ వాతావరణం ముదిరిన వేళ, యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు సౌదీపై సముద్ర ముట్టడి ప్రకటించిన వెంటనే ఈ ఒప్పందం వెలుగులోకి రావడం గమనార్హం. ఈ రేసులో చైనా లేదా రష్యా ముందుకెళ్లకుండా అడ్డుకునేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇజ్రాయెల్, అంతర్జాతీయ వర్గాల ఆందోళన
యురేనియం శుద్ధి సామర్థ్యం లభిస్తే, భవిష్యత్తులో అణుబాంబు తయారీ దిశగా సౌదీ అడుగులు వేసే ప్రమాదం ఉందని అణు రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2018లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఒక ఇంటర్వ్యూలో “ఇరాన్ గనక అణుబాంబును తయారుచేస్తే, మేము కూడా ఆలస్యం చేయకుండా ఆ దిశగా వెళ్తాం” అని స్పష్టం చేయడం ఈ ఆందోళనలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అమెరికా కాంగ్రెస్‌లోని ఇరు వర్గాల నుంచి ఈ ఒప్పందంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ, మధ్యప్రాచ్యంలో అధికార సమతుల్యతను మార్చే ఒక ప్రధాన శక్తిగా సౌదీ అరేబియా ఆవిర్భవించే అవకాశం ఉన్నట్టు స్పష్టమౌతోంది.




