US Sea Drones: అమెరికన్ ఆపరేషన్‌లో కీలక ఆయుధం...భయపెడుతున్న సీ డ్రోన్స్
ఇప్పటి వరకు ఆకాశంలో ఎగురుతూ శతృవులను వణికించిన డ్రోన్లు సరికొత్తగా సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
US Sea Drones: ఆధునిక ప్రపంచంలో యుద్ధ తంత్రాలు, రక్షణ రంగాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటివరకు ఆకాశంలో మాత్రమే హల్చల్ చేసిన డ్రోన్లు, ఇప్పుడు సముద్ర గర్భంలోనూ తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధి సమీపంలో జరిగిన ఒక ఉత్కంఠభరితమైన రెస్క్యూ ఆపరేషన్ అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. అమెరికా సైన్యానికి చెందిన ఇద్దరు అపాచీ హెలికాప్టర్ పైలట్లను కాపాడటంలో మానవరహిత అత్యాధునిక నౌక, ప్రపంచం ‘సీ డ్రోన్’ అని పిలిచే సాంకేతికత అత్యంత కీలక పాత్ర పోషించింది. సైనిక చరిత్రలోనే ఒక డ్రోన్ నౌక సముద్రంలో మానవ ప్రాణాలను రక్షించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
అసలేం జరిగింది? హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత
ఒమన్ సమీప సముద్ర జలాల్లో పహారా కాస్తున్న అమెరికాకు చెందిన AH-64 అపాచీ హెలికాప్టర్ ప్రమాదానికి గురై సముద్రంలో కూలిపోయింది. దీనికి ఇరాన్ కారణమని ఆరోపిస్తూ అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతీకార దాడులు కూడా చేపట్టింది. అయితే, ఆ సముద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు పైలట్లు ప్రాణాల కోసం దాదాపు రెండు గంటల పాటు నీటిలోనే పోరాడారు. అటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో ‘టాస్క్ ఫోర్స్ 59’ రంగంలోకి దింపిన సరికొత్త అస్త్రమే "కార్సెయిర్" అనే సీ డ్రోన్. టెక్సాస్‌కు చెందిన సరోనిక్ టెక్నాలజీస్ నిర్మించిన ఈ రోబోటిక్ నౌక, అత్యంత వేగంగా పైలట్లు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి వారిని సురక్షితంగా రక్షించింది.
కార్సెయిర్’ సీ డ్రోన్ సామర్థ్యాలు
ఈ సముద్రపు డ్రోన్లు మనుషులు లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఉపగ్రహ సమాచార వ్యవస్థ ఆధారంగా పనిచేస్తాయి. దీని సామర్థ్యం శత్రుదేశాలకు వణుకు పుట్టిస్తోంది. ఇది కేవలం 24 అడుగుల పొడవు ఉండే చిన్న నౌక, అందువల్ల శత్రువుల రాడార్లకు చిక్కడం చాలా కష్టం. దాదాపు 1,000 పౌండ్లు అంటే 453.5 కేజీల బరువును ఇది సునాయాసంగా మోయగలదు. గరిష్టంగా 35 నాట్ల వేగంతో, ఏకంగా 1,000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. శతృవుల రాడార్లను తప్పించుకొని వేగంగా దూసుకెళ్లి ఫైలట్లను రక్షించింది. దీంతో ఈ సీ డ్రోన్స్ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం సెర్చ్ చేస్తోంది. మల్టిపుల్ పద్దతుల్లో సీడ్రోన్స్‌ను వినియోగించేందుకు అవకాశం ఉండటంతో యుద్ధరంగంలో ఇవి కీలకం కానున్నాయి.
నిన్నటివరకు అమెరికా వీటిని కేవలం నిఘా కోసమే వాడింది. కానీ ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ దళాలు ఇలాంటి చిన్న బోట్లతోనే రష్యాకు చెందిన భారీ యుద్ధనౌకలను, హెలికాప్టర్లను ముంచేసి చరిత్ర సృష్టించాయి. సముద్ర గర్భాన కంటికి కనిపించకుండా సాగే ఈ సరికొత్త ఆయుధాల యుద్ధం, భవిష్యత్తులో ప్రపంచ దేశాల రక్షణ సమీకరణాలను పూర్తిగా మార్చేయబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.




