US sanctions on Iran: ఇరాన్‌ను అష్టదిగ్బంధనం చేస్తున్న అమెరికా... ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నం

US sanctions on Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌ను అన్ని వైపులా అష్టదిగ్బంధనం చేసే దిశగా కదులుతోంది అమెరికా.

Balachander
Published on: 16 April 2026 8:36 AM IST
US sanctions on Iran
X

US sanctions on Iran: ఇరాన్‌ను అష్టదిగ్బంధనం చేస్తున్న అమెరికా... ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌ను అన్ని వైపులా అష్టదిగ్బంధనం చేసే దిశగా కదులుతోంది అమెరికా. ముఖ్యంగా ఆర్థిక ఆంక్షలు, సముద్ర ముట్టడి, దౌత్య ఒత్తిళ్లతో ఇరాన్‌ను ఒంటరిచేయాలన్న వ్యూహాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఈ ఉద్రిక్తతల వెనుక ఉన్న అసలు కారణాలు, తాజా పరిణామాలను విశ్లేషిద్దాం.

ఆర్థిక, వ్యూహాత్మక దిగ్బంధనం

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌కు ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చైనా వంటి దేశాలు ఇరాన్‌కు ఆర్థిక సహకారం అందిస్తే, 'సెకండరీ సాంక్షన్స్‌' (ద్వితీయ ఆంక్షలు) ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చైనా తన ఇంధన అవసరాల్లో దాదాపు 8 శాతం ఇరాన్ నుంచే పొందుతోంది. కానీ, అమెరికా ఒత్తిడి కారణంగా ఈ కొనుగోళ్లు ఆగిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సముద్ర మార్గాల్లో అమెరికా ఆధిపత్యం

ఇప్పటి వరకు గగనతలం నుంచి యుద్ధం చేసిన అమెరికా ఈసారి సముద్రమార్గంలో కూడా ఇరాన్‌ను ముప్పుతిప్పలు పెట్టాలని చూస్తోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, యుద్ధనౌకలతో రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఇరాన్ తీరానికి సమీపంలో అమెరికాకు చెందిన 10కి పైగా యుద్ధనౌకలు, 10 వేల మందికి పైగా సైనికులు మోహరించారు. హొర్ముజ్ జలసంధి వద్ద అమెరికా చేపట్టిన సముద్ర ముట్టడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బందర్ అబ్బాస్ పోర్టు నుంచి బయలుదేరిన నౌకలను అడ్డుకుని, ఇప్పటివరకు 10 నౌకలను అమెరికా వెనక్కి తిప్పింది. అంటే, ఇరాన్ సముద్ర వాణిజ్యంపై అమెరికా పూర్తిస్థాయి పట్టు సాధించింది.

నిలిచిపోయిన ఆయిల్ లైసెన్సులు

ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసేందుకు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా-ఇరాన్ చమురు లావాదేవీలకు ఇస్తున్న తాత్కాలిక మినహాయింపులను రద్దు చేస్తున్నట్లు ట్రెజరీ ప్రకటించింది. దీనివల్ల ఇరాన్ తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. అక్రమ చమురు రవాణా నెట్‌వర్క్‌పై దృష్టి సారించిన అమెరికా, మహ్మద్ హొస్సేన్ షామ్‌ఖానీతో సంబంధం ఉన్న రెండు డజన్ల సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించింది.

ఏమాత్రం తగ్గని ఇరాన్‌

ఎంత ఒత్తిడిని తీసుకొస్తే తాము అంతగా విరుచుకుపడతామని ఇరాన్‌ హెచ్చరిస్తోంది. దాడులకు దిగితే దానికి ప్రతిస్పందన కూడా అంతేవిధంగా ఉంటుందని ఇరాన్‌ చెబుతోంది. తమను లేకుండా చేయడం అమెరికాకు అసాధ్యమని ఇరాన్‌ చెబుతోంది. ఎవరెన్ని కుట్రలు చేసినా ఇరాన్‌ సార్వభౌమత్వాన్ని ఏమీ చేయలేరని అంటోంది. ఇదే సమయంలో ఇజ్రాయిల్‌ కూడా వెనక్కి తగ్గడం లేదు. దక్షిణ లెబనాన్‌పై విరుచుకుపడుతున్నది. అమెరికా, ఇజ్రాయిల్‌ లక్ష్యాలు ఒక్కటేనని ప్రధాని నెతన్యాహు పేర్కొనడం విశేషం. ఈరోజు రెండో విడత శాంతి చర్చలు జరగబోతున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి. శాంతి మాటలు చెబుతూనే దాడులకు సిద్దం కావడంతో ప్రపంచ దేశాలు కూడా అలర్ట్‌ అవుతున్నాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story