US vs Iran : మళ్లీ రాజుకున్న పశ్చిమాసియా మంటలు.. ఇరాన్‌పై అమెరికా కొత్త ఆర్థిక ఆంక్షల అస్త్రం
US vs Iran : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్ అగ్రనేతలకు నిధులు చేరకుండా అమెరికా కొత్తగా 14 మందిపై ఆర్థిక ఆంక్షలు విధించింది.
US vs Iran
US vs Iran : అంతర్జాతీయ వేదికపై అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్య, రాజకీయ యుద్ధం మరోసారి ముదిరింది. ఇరాన్ ప్రభుత్వ ఆర్థిక మూలాలను దెబ్బతీసే వ్యూహంలో భాగంగా అమెరికా ప్రభుత్వం శుక్రవారం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌తో సంబంధాలు కలిగి ఉండి, అంతర్జాతీయ ఆర్థిక నిబంధనలను ఉల్లంఘిస్తున్న 14 మంది వ్యక్తులు, కొన్ని ప్రముఖ సంస్థలపై కొత్తగా కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ వ్యక్తులు, కంపెనీలు దొంగచాటుగా ఇరాన్ అగ్రనేతలకు, అక్కడి ప్రభుత్వానికి నిధులను చేరవేస్తున్నాయని అమెరికా గట్టిగా ఆరోపిస్తోంది.
అమెరికా టార్గెట్ ఇరాన్ బ్యాంకర్ అలీ అన్సారీ
అమెరికా ట్రెజరీ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ తాజా ఆంక్షల్లో ప్రధానంగా దుబాయ్‌లో నివసిస్తున్న ఇరాన్ బ్యాంకర్, ప్రముఖ వ్యాపారవేత్త అలీ అన్సారీని టార్గెట్ చేశారు. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన ప్రజాధనాన్ని విదేశాలకు అక్రమంగా తరలించి, అక్కడ రియల్ ఎస్టేట్, ఇతర వాణిజ్య రంగాలలో భారీగా పెట్టుబడులు పెట్టడం వెనుక అన్సారీ కీలక పాత్ర పోషించాడని అమెరికా గుర్తించింది. ఈ నిధుల ద్వారా ఇరాన్ ప్రభావవంతమైన నాయకులతో పాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అనే సైనిక విభాగానికి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం చేకూరినట్లు యూఎస్ నిఘా వర్గాలు నిర్ధారించాయి.
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెక్
అలీ అన్సారీ మరియు అతని అనుచరులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో డొల్ల కంపెనీలను, నకిలీ బ్యాంక్ ఖాతాలను సృష్టించి అరబీల కొద్దీ డాలర్ల లావాదేవీలను గుట్టుచప్పుడు కాకుండా నడిపినట్లు అమెరికా చెబుతోంది. ఈ క్రమంలోనే అమెరికా ట్రెజరీ విభాగానికి చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ సంస్థ (OFAC) ఇరాన్‌కు చెందిన మూడు ప్రధాన ఎక్స్ఛేంజ్ కంపెనీలతో పాటు మరికొన్ని విదేశీ ఫ్రంట్ కంపెనీలపై నిషేధం విధించింది. నిషేధిత ఇరాన్ బ్యాంకుల తరపున ఇవి ఏటా బిలియన్ల కొద్దీ డాలర్ల లావాదేవీలు జరుపుతూ, అసలు మనీ నెట్వర్క్ ఎవరిదో తెలియకుండా కప్పిపుచ్చుతున్నాయని అమెరికా మండిపడింది. ఈ నెట్వర్క్ వల్లే ఇరాన్‌కు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో సంబంధాలు తెగిపోకుండా విదేశీ కరెన్సీ అందుతోందని అమెరికా వాదిస్తోంది.
హోర్ముజ్ జలసంధిలో ఆయిల్ టాంకర్లపై దాడులు
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న తరుణంలోనే అమెరికా ఈ కఠిన నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. గత వారం రోజులుగా గల్ఫ్ రీజియన్‌లో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కతార్, సౌదీ అరేబియాలకు చెందిన మూడు ఆయిల్ టాంకర్లపై ఇరాన్ సైన్యం దాడి చేసిందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతీకారంగా అమెరికా ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేయగా, ఇరాన్ సైతం గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా మిలిటరీ బేస్‌లపై రాకెట్లతో రివెంజ్ దాడులు చేసింది. ప్రస్తుతానికి అక్కడ వాతావరణం కాస్త ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతోంది.
ఇరాన్‌తో కుదిరిన యుద్ధ విరామ ఒప్పందం ముగిసింది
ఈ మొత్తం ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ దేశంతో గతంలో కుదిరిన తాత్కాలిక యుద్ధ విరామ ఒప్పందం ఇప్పుడు పూర్తిగా ముగిసిపోయిందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇరాన్ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రత్యేక వినతి మేరకు, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కొనసాగించడానికి మాత్రం తాము అంగీకరించినట్లు ట్రంప్ వెల్లడించారు. మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పందిస్తూ.. ఇరాన్ పాలకుల ఆర్థిక సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసే వరకు తమ వద్ద ఉన్న అన్ని చట్టపరమైన, ఆర్థిక ఆయుధాలను ఉపయోగిస్తామని గట్టిగా హెచ్చరించారు.
అగ్రరాజ్యం ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదు
అమెరికా విధిస్తున్న ఈ ఆర్థిక ఆంక్షలపై ఇరాన్ ప్రభుత్వం కూడా అంతే తీవ్రంగా స్పందించింది. అమెరికా ఏకపక్షంగా అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, ఒకవేళ తమపై సైనిక చర్యలకు దిగితే పూర్తి శక్తీతో తిప్పికొడతామని ఇరాన్ సీనియర్ నాయకుడు మహ్మద్ బాకర్ కాలిబాఫ్ హెచ్చరించారు. అగ్రరాజ్యం ఎన్ని ఆర్థిక పరమైన ఒత్తిళ్లు తెచ్చినప్పటికీ, ఇరాన్ దేనికీ లొంగిపోయే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ ఆర్థిక, సైనిక ఘర్షణల వల్ల రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరాపై, గ్లోబల్ బిజినెస్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.




