USA: భారత్ సహా 40 దేశాలపై నిఘా పెట్టిన అమెరికా.. చైనా సరుకుల అక్రమ రవాణ విషయంలో
USA: అమెరికా చైనా నుంచి వచ్చే వస్తువుల అక్రమ రవాణాపై మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది.
USA: భారత్ సహా 40 దేశాలపై నిఘా పెట్టిన అమెరికా.. చైనా సరుకుల అక్రమ రవాణ విషయంలో
USA: అమెరికా చైనా నుంచి వచ్చే వస్తువుల అక్రమ రవాణాపై మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. చైనా ఉత్పత్తులు ఇతర దేశాల పేరుతో అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నాయని ఆరోపిస్తూ, భారత్‌తో పాటు 40కి పైగా దేశాలను ప్రత్యేక నిఘా జాబితాలో చేర్చింది.
చైనా వస్తువులు ఇతర దేశాల పేరుతో అమెరికాకు చేరుతున్నాయా?
అమెరికా ప్రకారం, చైనాలో తయారైన కొన్ని వస్తువులను నేరుగా అమెరికాకు పంపకుండా ముందుగా మరో దేశానికి తరలిస్తున్నారు. అక్కడ వాటికి కొత్త లేబుళ్లు వేయడం, కొత్త ప్యాకింగ్ లేదా స్వల్ప మార్పులు చేయడం ద్వారా అవి ఆ దేశంలో తయారైన ఉత్పత్తులుగా చూపిస్తున్నారని ఆరోపిస్తోంది. దీని వల్ల చైనా వస్తువులపై అమెరికా విధించిన అధిక సుంకాలను తప్పించుకునే అవకాశం కలుగుతోందని పేర్కొంది. ఈ ప్రక్రియను ట్రాన్స్‌షిప్‌మెంట్‌గా అమెరికా గుర్తిస్తోంది.
సెక్షన్ 301 టారిఫ్‌ల తర్వాత పెరిగిన అక్రమ రవాణా
2018లో అమెరికా, అన్యాయ వాణిజ్య పద్ధతులను అనుసరిస్తోందన్న ఆరోపణలతో చైనాపై సెక్షన్ 301 కింద భారీ టారిఫ్‌లు విధించింది. ఆ నిర్ణయం తర్వాత చైనా ఉత్పత్తులు ప్రత్యక్షంగా కాకుండా ఇతర దేశాల ద్వారా అమెరికాకు చేరుతున్నాయని నివేదికలో వెల్లడించింది. ఈ తరహా అక్రమ లేదా అనుమానాస్పద ట్రాన్స్‌షిప్‌మెంట్ వాణిజ్య విలువ సుమారు 303 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అమెరికా అంచనా వేసింది. దీంతో ఈ అంశాన్ని జాతీయ వాణిజ్య భద్రతకు సంబంధించిన కీలక సమస్యగా పరిగణిస్తోంది.
చైనా ఇతర దేశాలను ఎందుకు ఉపయోగిస్తోంది.?
తక్కువ ఉత్పత్తి వ్యయం, కార్మిక ఖర్చులు తక్కువగా ఉండటం, కస్టమ్స్ తనిఖీలు అంత కఠినంగా లేకపోవడం వంటి కారణాలతో చైనా తయారీ సంస్థలు కొన్ని దేశాలను మధ్యవర్తులుగా ఉపయోగిస్తున్నాయని అమెరికా పేర్కొంది. ఈ దేశాల్లో వస్తువులకు రీ-లేబులింగ్, రీ-ప్యాకేజింగ్ లేదా స్వల్ప మార్పులు చేసిన తర్వాత వాటిని అమెరికాకు ఎగుమతి చేస్తున్నారని తెలిపింది. బయటకు చూస్తే అవి ఆ దేశంలో తయారైన వస్తువుల్లా కనిపించినప్పటికీ, అసలు ఉత్పత్తి మాత్రం చైనాలోనే జరిగిందని అమెరికా ఆరోపిస్తోంది.
భారత్ సహా 40 దేశాలపై అమెరికా ప్రత్యేక నిఘా
ఈ నివేదికలో భారత్‌తో పాటు 40కిపైగా దేశాలు చైనా వస్తువుల ట్రాన్స్‌షిప్‌మెంట్‌కు అవకాశం ఉన్న దేశాలుగా గుర్తించారు. అయితే ఈ దేశాల ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా అక్రమ రవాణాకు సహకరిస్తున్నాయని అమెరికా స్పష్టంగా ఆరోపించలేదు. అయినా, ఈ దేశాల ద్వారా చైనా ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లోకి చేరే అవకాశం ఉందని భావిస్తూ వాటిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తామని వెల్లడించింది.
అక్రమ రవాణాను అడ్డుకునేందుకు AI టెక్నాలజీ
చైనా వస్తువుల అసలు మూలాన్ని గుర్తించేందుకు అమెరికా "డిటెక్టివ్ బోర్డర్" పేరుతో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యవస్థ షిప్‌మెంట్ రికార్డులు, సరుకు ప్రయాణించిన మార్గం (Routing History), యాజమాన్య వివరాలు (Ownership Links), దిగుమతి-ఎగుమతి సమాచారం వంటి అనేక అంశాలను విశ్లేషించి అనుమానాస్పద సరుకులను ముందుగానే గుర్తిస్తుంది. దీంతో అమెరికా కస్టమ్స్ అధికారులు చైనా వస్తువులను ఇతర దేశాల పేరుతో అమెరికాలోకి తీసుకురావడాన్ని మరింత సమర్థంగా అడ్డుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.




