USA War Budget: ఇరాన్‌తో యుద్ధం కోసం ఇప్పటి వరకు అమెరికా ఎంత ఖర్చు చేసిందో తెలుసా?

USA War Budget: అమెరికా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచాలని నిర్ణయించడం గ్లోబల్ ఎకానమీపై ప్రభావం చూపే అంశంగా మారింది.

Balachander
Published on: 4 April 2026 9:05 AM IST
USA War Budget Iran Conflict
X

USA War Budget Iran Conflict

USA War Budget: ప్రపంచం యుద్ధ భయంతో వణికుతున్న వేళ… అమెరికా తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచాలని నిర్ణయించడం గ్లోబల్ ఎకానమీపై ప్రభావం చూపే అంశంగా మారింది.

14 లక్షల కోట్ల బడ్జెట్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రక్షణ కోసం బడ్జెట్‌ను 1.5 ట్రిలియన్‌ డాలర్లను ప్రతిపాదించాడు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 14 లక్షల కోట్లకు సమానం. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఈ స్థాయిలో భారీ రక్షణ కోసం బడ్జెట్‌ను కేటాయించడం ఇదే మొదటిసారి. పెరుగుతున్న యుద్ద పరిస్థితులు, ఆయుధ అవసరాలు, భద్రతా సవాళ్లు కలిసి ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. అంతేకాదు, పశ్చిమ ఆసియాలో సైనిక చర్యల వలన రోజుకు సుమారు 2 బిలియన్‌ డాలర్లు అంటే రూ. 16,600 కోట్లు ఖర్చు అవుతున్నట్లు అంచనా. అంటే ఒక్కరోజులోనే ఒక చిన్నదేశం వార్షిక బడ్జెట్‌కు సమానమైన మొత్తం ఖర్చవుతోంది. యుద్ధం ప్రారంభమైన మొదటివారంలోనే సుమారు 11.3 బిలియన్‌ డాలర్లు అంటే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ సంఖ్యలు చూస్తే యుద్ధం ఎంత భారీ ఖర్చుతో కూడుకొని ఉన్నదో అర్ధమౌతుంది.

భారీ కోత

యుద్ధం కోసం క్షిపణులు, ఆధునిక ఆయుధాలు, సైనిక సామాగ్రి, సైన్యం నిర్వహణ తదితర అంశాల కోసం భారీగా ఖర్చు చేయవలసి వస్తుంది. అంతేకాదు, చైనా వంటి దేశాల నుంచి ఉన్న భద్రతా ముప్పులను కూడా ఎదుర్కొనేందుకు కూడా అమెరికా తన సైనిక శక్తిని మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఇంత భారీ మొత్తాన్ని రక్షణ కోసం ప్రభుత్వం సమకూర్చుకోవడం సామాన్యమైన విషయం కాదు. దీనికోసం సామాజిక, సంక్షేమ రంగాల్లో భారీగా కోతలు పెట్టే ప్రతిపాదనను కూడా తీసుకొచ్చింది. వైద్య, ఆరోగ్య రంగాల బడ్జెట్‌ నుంచి 73 బిలియన్‌ డార్ల మేర కోత విధించాలని, ఆ డబ్బును రక్షణకు మళ్లించాలని చూస్తోంది. ఈ నిర్ణయం రాజకీయంగా చర్చకు దారి తీసింది. భద్రత ముఖ్యమని ప్రభుత్వం చెబుతుంటే... ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టడం సరికాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

బడ్జెట్‌పై చర్చ

కాంగ్రెస్‌లో ఈ బడ్జెట్‌పై తీవ్రంగా చర్చ జరుగుతోంది. మొత్తం 1.5 ట్రిలియన్‌ డాలర్లలో 1.1 ట్రిలియన్‌ డాలర్లను సాధారణ ఆమోద ప్రక్రియద్వారా, మిగిలిన 350 బిలియన్‌ డాలర్లను ప్రత్యేక విధానంతో ఆమోదించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, దీనికి రాజకీయ సమీకరణాలు కీలకంగా మారాయి. యుద్ధం వంటి ప్రత్యేక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆయా దేశాలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తాయి. ప్రభుత్వం చేసే ఇలాంటి ఖర్చులకు ప్రతిఫలం పన్నుల రూపంలో ప్రజలు భరించాల్సి వస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story