US Iran War: ట్రంప్ ఎత్తులన్నీ చిత్తు.. ఇరాన్ వ్యూహంలో చిక్కుకున్న అగ్రరాజ్యం

US Iran War: ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు అమెరికా వేసిన ఆర్థిక, సైనిక దిగ్బంధనం వ్యూహం దారుణంగా దెబ్బతింది.

CR Reddy
Published on: 15 Aug 2026 7:23 AM IST
US Iran War
X

US Iran War

US Iran War: ఇరాన్ చుట్టూ విధించిన సముద్ర దిగ్బంధనం ఇప్పుడు అమెరికాకే ముళ్లకంపలా మారింది. ఇరాన్‌ను ఒంటరిని చేసి ఆర్థికంగా దెబ్బతీయాలని భావించిన ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అంచనాలు తలకిందులయ్యాయి. గత 260 రోజులుగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో గస్తీ కాస్తున్న అమెరికా ప్రతిష్టాత్మక విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ తీవ్రమైన దిగ్బంధన సమస్యలతో వెనక్కి వెళ్లక తప్పడం లేదు. దాదాపు 200 రోజులకు పైగా ఏ రేవులోనూ ఆగకుండా సముద్రంలోనే ఉండిపోవడంతో నౌకలోని సైనికులకు ఆహార కొరత ఏర్పడింది. మానసిక ఒత్తిడి తట్టుకోలేక కొందరు నావికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారనే వార్తలు వెలువడటం వషింగ్టన్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో లింకన్ స్థానంలో యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ నౌకను హుటాహుటిన అరబ్ సముద్రానికి తరలిస్తున్నారు.

కొత్త డ్రోన్ టాస్క్ ఫోర్స్‎తో ట్రంప్ గారడీ

ఒంటరిగా ఇరాన్‌ను ఢీకొట్టడం అసాధ్యమని గ్రహించిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు గల్ఫ్ దేశాలతో కలిసి కొత్త డ్రామాకు తెరతీసింది. సెంట్రల్ కమాండ్ (CENTCOM) నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఫాల్కన్ స్ట్రైక్ పేరుతో భారీ డ్రోన్ దళాన్ని ఏర్పాటు చేస్తోంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఖతార్, జోర్డాన్ వంటి దేశాలను ఈ కూటమిలో భాగస్వాములను చేసేందుకు ముమ్మర చర్చలు జరుపుతున్నారు. ఇరాన్ దాడుల్లో ఇప్పటికే 25 శాతానికి పైగా ఖరీదైన MQ-9 రీపర్ డ్రోన్లను కోల్పోయిన అమెరికా, భారీ ఆర్థిక భారాన్ని తట్టుకోలేక తక్కువ ఖర్చుతో కూడిన ఆత్మాహుతి డ్రోన్లు, సముద్ర అంతర్భాగంలో పనిచేసే అండర్‌వాటర్ డ్రోన్లను వాడాలని నిశ్చయించుకుంది.

సాంకేతికతలో వెనకడుగు.. పాత పద్ధతులకే ఓటు

ఒకవైపు ఆసియాలో చైనా అత్యంత అధునాతన ఇలెక్ట్రోమాగ్నెటిక్ విమాన ప్రయోగ వ్యవస్థలను (EMALS) తన యుద్ధనౌకల్లో ఏర్పాటు చేస్తుంటే, అమెరికా మాత్రం ఖర్చులు తగ్గించుకునేందుకు పాతకాలపు స్టీమ్ కేటాపుల్ట్ టెక్నాలజీకే మొగ్గుచూపుతుండటం గమనార్హం. పెంటిగాన్ ఆదేశించిన నయా విమాన వాహక నౌకల్లో ఈ నూతన సాంకేతికత అత్యంత ఖరీదైనదిగా, అత్యవసర సమయాల్లో వేగంగా బాగుచేయడానికి వీలులేనిదిగా ఉందంటూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌తో సుదీర్ఘ పోరు వల్ల అమెరికా రక్షణ బడ్జెట్ అమాంతం పెరిగిపోతుండటమే ఈ వెనకడుగుకు ప్రధాన కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దిగ్బంధనమా? దండయాత్రనా?

ఇరాన్ విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి అడుగులు వేయాలనే దానిపై అమెరికా ఆర్మీ అధికారుల మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం నాకాబందీ వల్ల ఇరాన్ లొంగదని, దానిపై నేరుగా సైనిక దాడులు జరపాల్సిందేనని సెంట్రల్ కమాండ్ చీఫ్ బ్రాడ్ కూపర్ పట్టుబడుతున్నారు. అయితే సైనిక చర్య చేపడితే తలెత్తే తీవ్ర పరిణామాలను ఆలోచించి ట్రంప్ బృందం తీవ్రమైన గందరగోళంలో పడింది. సముద్ర దిగ్బంధనాన్ని పొడిగిస్తూ పోతే అమెరికా ఖజానా ఖాళీ అవ్వడం తప్ప సాధించేదేమీ లేదని వాషింగ్టన్ రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story