Venezuela Earthquake : 126 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద విపత్తు.. 235 మంది మృతి.. 39 వేల మందికి పైగా గల్లంతు
Venezuela Earthquake : వెనిజులాలో 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల 235 మంది మరణించారు. 39 వేల మంది గల్లంతు కాగా, అమెరికా సహాయక చర్యల కోసం తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేసింది.
Venezuela Earthquake
Venezuela Earthquake : లాటిన్ అమెరికా దేశమైన వెనిజులాలో ప్రకృతి కోరలు చాచింది. బుధవారం సాయంత్రం వేళ అక్కడ సంభవించిన రెండు వరుస శక్తివంతమైన భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 7.2, 7.5గా నమోదైనట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ భూకంపాల ధాటికి వందలాది బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లు క్షణాల వ్యవధిలో కుప్పకూలిపోయాయి. గత 126 సంవత్సరాల వెనిజులా చరిత్రలోనే ఇది అత్యంత భయంకరమైన, అతిపెద్ద భూకంపాలలో ఒకటిగా రికార్డులకు ఎక్కింది. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే పక్కనే ఉన్న బ్రెజిల్ దేశంలోని అమెజాన్ అటవీ ప్రాంతంలో కూడా భూప్రకంపనలు స్పష్టంగా గుర్తింపబడ్డాయి.
పెరుగుతున్న మృతుల సంఖ్య.. వేలల్లో గల్లంతు
ఈ దారుణ విపత్తులో ఇప్పటివరకు 235 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. సుమారు 1,500 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, కాంక్రీట్ శిథిలాల కింద 200 మందికి పైగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కాగా, నగరాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 39 వేల మంది ప్రజల ఆచూకీ లభించకపోవడం అత్యంత కలవరానికి గురిచేస్తోంది. బాధితుల కుటుంబ సభ్యులు తమ వారి ఫోటోలను పట్టుకుని వీధుల్లో, సోషల్ మీడియాలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వెతుకులాట సాగిస్తున్నారు.
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
భూకంపం సంభవించిన గురువారం ఉదయం నుండే స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రాణాలతో ఉన్న తమ బంధువులను కాపాడుకోవడానికి జనాలు చేతులతోనే మట్టిని, కాంక్రీట్ దిమ్మెలను తొలగిస్తున్నారు. శిథిలాల కింద నుంచి రక్తం, దూళితో నిండిపోయిన చిన్న పిల్లలను, పెంపుడు జంతువులను రక్షక దళాలు బయటకు తీస్తున్నాయి. ఒక భారీ సిమెంట్ స్లాబ్ కింద చిక్కుకున్న మహిళను ప్రభుత్వ రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించిన దృశ్యాలను అక్కడి ప్రభుత్వ టీవీ ఛానెల్ ప్రసారం చేసింది. అయితే రాజధాని కరాకస్ వెలుపల ఉన్న గ్రామీణ ప్రాంతాలకు మాత్రం ప్రభుత్వ సహాయక బృందాలు ఇంకా పూర్తిస్థాయిలో చేరుకోలేకపోయాయి.
లా గుయరా తీరప్రాంతం అతలాకుతలం
ఈ భూకంపం వల్ల అత్యధికంగా నష్టపోయింది లా గుయరా అనే తరిప్రాంతం. ఇక్కడి వందలాది నివాస సముదాయాలు నేలమట్టమయ్యాయి. దేశంలోనే అత్యంత కీలకమైన ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. భూకంపం దెబ్బకు రన్‌వే, టెర్మినల్స్ దెబ్బతినడంతో విమానాశ్రయాన్ని అధికారులు పూర్తిగా మూసివేశారు. దీనివల్ల విదేశాల నుంచి వచ్చే అత్యవసర వైద్య సేవలు, నిత్యావసర వస్తువుల రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో వెనిజులా తాత్కాలిక రాష్ట్రపతి డెల్సీ రోడ్రిగ్జ్ లా గుయరా ప్రాంతాన్ని జాతీయ విపత్తు ప్రాంతంగా ప్రకటించారు. భారీ క్రేన్లు, యంత్రాలను అందించాలని ప్రైవేట్ కంపెనీలను కోరారు.
స్తంభించిన జీవనం.. సహాయక శిబిరాలుగా పాఠశాలలు
ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా కారణాల దృష్ట్యా దేశంలోని పలు నగరాల్లో విద్యుత్ సరఫరా, మొబైల్ నెట్‌వర్క్, గ్యాస్ పైప్‌లైన్లు, మెట్రో సేవలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోయి విదేశాల్లో ఉంటున్న వెనిజులా పౌరులు తమ కుటుంబ సభ్యుల సమాచారం తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, పాఠశాలలు మరియు కాలేజీలను నిరాశ్రయులైన బాధితుల కోసం తాత్కాలిక సహాయక శిబిరాలుగా మార్చింది.
ముందుకు వచ్చిన ప్రపంచ దేశాలు.. ఆంక్షలు ఎత్తేసిన యూఎస్
వెనిజులాలో సంభవించిన ఈ ఘోర విపత్తుపై ప్రపంచ దేశాలు మానవత్వంతో స్పందిస్తున్నాయి. డొమినికన్ రిపబ్లిక్ నుంచి మొదటి రెస్క్యూ టీమ్ ఇప్పటికే వెనిజులా చేరుకోగా.. మెక్సికో, బ్రెజిల్, కెనడా, స్పెయిన్, పోర్చుగల్, ఖతార్ దేశాల నుంచి ప్రత్యేక మెడికల్ టీమ్స్, శిక్షణ పొందిన కుక్కలు, డ్రోన్లు, వాటర్ ప్యూరిఫైయింగ్ మెషీన్లు వేగంగా తరలివస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వెనిజులాపై ఉన్న అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలను అక్టోబర్ 23 వరకు తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా అంతర్జాతీయ సహాయం వెనిజులాకు చేరనుంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, తాము వెనిజులా ప్రజలకు అండగా ఉంటూ వేగంగా సహాయక సామగ్రిని పంపుతున్నామని స్పష్టం చేశారు.




