Tsunami Warning : భూకంపాల బీభత్సం.. వెనెజువెలా, జపాన్‌లో హై అలర్ట్.!
Tsunami Warning : ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విలయతాండవం చేస్తోంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే వెనెజువెలా , జపాన్ దేశాలలో భారీ భూకంపాలు సంభవించి ప్రజలను..
earthquake
Tsunami Warning : ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విలయతాండవం చేస్తోంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే వెనెజువెలా , జపాన్ దేశాలలో భారీ భూకంపాలు సంభవించి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. భూమి ఒక్కసారిగా కంపించడంతో భవనాలు ఊగిపోయాయి. ఈ ఘోర విపత్తు ధాటికి ఇరు దేశాల్లోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి.
వెనెజువెలాలో నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు
వెనెజువెలా దేశాన్ని భూకంపాలు ఒకదాని వెనుక ఒకటిగా వణికించాయి. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇక్కడ రెండు భారీ భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదు కాగా.. ఆ వెంటనే సంభవించిన రెండో భూకంప తీవ్రత ఏకంగా 7.5గా నమోదైంది. ఈ స్థాయి తీవ్రతతో భూమి కంపించడంతో రాజధాని కరాకస్‌తో పాటు దేశంలోని పలు నగరాల్లో బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లు కుప్పకూలాయి. భూమి విపరీతంగా కదలడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుండి రోడ్లపైకి పరుగులు తీశారు.
ప్యూర్టోరికో, వర్జిన్ దీవులకు సునామీ ముప్పు
వెనెజువెలాలో సంభవించిన ఈ అత్యంత భారీ భూకంపాల ప్రభావంతో సముద్రంలో ఉప్పెన వచ్చే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించారు. దీనివల్ల ప్యూర్టోరికో , వర్జిన్ దీవులకు శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు అత్యవసర సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, సముద్ర తీరానికి ఎవరూ వెళ్లకూడదని హెచ్చరించారు. రాబోయే కొన్ని గంటలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
జపాన్‌నూ వణికించిన భూకంపం.. రైలు సర్వీసులు బంద్
మరోవైపు పసిఫిక్ మహాసముద్ర అవతలి ఒడ్డున ఉన్న జపాన్ దేశాన్ని కూడా భూకంపం పలకరించింది. జపాన్‌లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. భూకంపం రాగానే అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించింది. ప్రయాణికుల రక్షణ దృష్ట్యా దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లతో పాటు సాధారణ రైలు సర్వీసులను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.
ప్రస్తుతం రెండు దేశాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిమిషాల వ్యవధిలో ప్రపంచంలోని రెండు వేర్వేరు దేశాల్లో ఈ స్థాయి భూకంపాలు రావడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.




