Vietnam Boat Tragedy: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారూ బలి

వియత్నాంలో భారతీయులతో ప్రయాణిస్తున్న టూరిస్ట్ పడవ బోల్తా. 15 మంది మృతి, పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 July 2026 4:50 AM IST
Vietnam Boat Tragedy
X

Vietnam Boat Tragedy

వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఫు క్వాక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ టూరిస్ట్ బోట్ శనివారం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. స్థానిక అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

ప్రమాదానికి గురైన పడవలో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు, నలుగురు సిబ్బంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో తమిళనాడుకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, కేరళకు చెందిన ఇద్దరు ఉన్నారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన ఇద్దరు భారతీయులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

భారత రాయబార కార్యాలయం సహాయక చర్యలను సమన్వయం చేస్తోంది. హో చి మిన్ సిటీ, హనోయ్ నగరాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారం, సహాయం అందిస్తోంది.

ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వియత్నాం అధికారులతో భారత రాయబార కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.

ఇదిలా ఉండగా, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వియత్నాం ప్రధాని లే మిన్ హంగ్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జల రవాణా భద్రతా ప్రమాణాలను సమీక్షించాలని సూచించారు.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story