Vietnam Cat Trafficking: వియాత్నంలో పిల్లుల అక్రమ రవాణా...అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు
వియాత్నంలో పిల్లులను అక్రమ రావాణా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. 400 పిల్లులను పోలీసులు రక్షించారు. దీనికి సంబంధించిన కథనం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Vietnam Cat Trafficking: ఇంట్లో పిల్లులను అల్లారుముద్దుగా పెంచుకునేవారు కోకొల్లలుగా ఉన్నారు. అలా అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లులు ఒక్కసారిగా మాయమైతే... ఎక్కడికైనా వెళ్లాయనో లేదా పక్కింటికి వెళ్లాయేమోనని అనుకుంటాం. కానీ, వియాత్నంలో జరుగుతున్న ఈ ఘోరాన్ని వింటే నిజంగా గుండె తరుక్కుపోతుంది. అక్కడ ఇళ్లల్లో పెంచుకునే పెంపుడు పిల్లులను దొంగిలించి వాటి మాంసాన్ని విక్రయించే ఓ అంతర్జాతీయ ముఠాను హో చిమిన్ సిటీ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఆపరేషన్‌లో దొంగిలించిన నాలుగు వందలకు పైగా పిల్లులను రక్షించడమే కాకుండా తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వియాత్నంలో చాలా ప్రాంతాల్లో పిల్లులను అక్రమంగా పట్టుకొని చంపి వాటి మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఒక్క పిల్లులే కాదు...పాముల నుంచి మనం కలలో కూడా ఊహించని పురుగుల వరకు ఆహారంగా తీసుకుంటారు.
మూడేళ్లుగా సాగుతున్న చీకటి వ్యాపారం
పోలీసుల దర్యాప్తులో తేలిన నిజాల ప్రకారం... ఈ ముఠా గత మూడేళ్లుగా వియత్నాంలోని వివిధ ప్రాంతాల్లో పెంపుడు పిల్లులను వ్యూహాత్మకంగా దొంగిలిస్తోంది. పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో 400 పైగా బతికున్న పిల్లులతో పాటు, ఐస్‌లో గడ్డకట్టించి ఉంచిన మరో 80 చనిపోయిన పిల్లుల కళేబరాలను కనుగొన్నారు. ఈ మూగజీవాలలో గర్భంతో ఉన్న పిల్లులు, అప్పుడే పుట్టిన పిల్లి పిల్లలు కూడా ఉండటం అక్కడి జంతు ప్రేమికులను తీవ్రంగా కలచివేస్తోంది. మూగజీవాల అక్రమ రవాణా ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి మానవ హక్కుల సంఘాలు, జంతు ప్రేమికులు రోడ్డెక్కుతున్నారు.
పిల్లి మాంసం ధర ఎంతో తెలుసా?
వియత్నాంలో పిల్లి మాంసం తినడం చట్టవిరుద్ధం ఏమీ కాదు, కానీ ఆ జంతువులను చట్టబద్ధమైన మార్గాల్లోనే సేకరించాలనే నిబంధన ఉంది. పిల్లి మాంసం తినడం చట్ట విరుద్దం కాకపోవడంతో అక్రమ మార్గాల్లో రవాణా చేస్తున్నారు. ఇంట్లో పెంపుడు పిల్లులు బలిష్టంగా ఉండటంతో పాటు మాంసం అధికంగా ఉంటుందనే దురాలోచనతో వీటిని దొంగిలిస్తున్నారు. ఈ ముఠా మాత్రం ఇళ్లలో దొంగిలించిన పిల్లులను కిలో కేవలం 70,000 వియత్నామీస్ డాంగ్‌లకు అంటే మన కరెన్సీలో సుమారు రూ. 220 లేదా 2.60 డాలర్లుకు అమ్ముతున్నట్లు పోలీసుల ఇంటరాగేషన్‌లో బయటపడింది.
ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది
పోలీసులు గత 45 రోజులుగా ప్రత్యేకంగా సెర్చింగ్ నిర్వహిస్తున్నారు. నేర నియంత్రణపై ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెట్‌వర్క్ బయటపడింది. కాగా, పోలీసులు రక్షించిన 400 పిల్లుల్లో 40 పిల్లులను వాటి యజమానులకు అప్పగించారు. ముఠా చేతికి చిక్కిన పిల్లులను తీవ్రంగా హింసించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ పిల్లులు ఒత్తిడి గురయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా పోలీసులు తెలియజేశారు. వాటికి జంతు సంరక్షణ కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నారు. చట్టాల్లో లొసుగులను వాడుకుంటూ పెంపుడు జంతువులను దొంగిలించి విక్రయించే ఇటువంటి మాఫియాని కట్టడి చేయడానికి వియాత్నం ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఇలాంటి ముఠాలు ఇంకా ఎన్ని ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కొన్ని రకాలైన జంతువులను మాత్రమే మాంసాహారంగా వినియోగించాలని చట్టం చేయాలనే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది.




