భార్య అదృశ్యమైనట్లు ఫిర్యాదు.. రెండేళ్ల తర్వాత కోర్టులో భర్త సంచలన వాంగ్మూలం!
Virginia: అమెరికా వర్జీనియాలో భార్యను ముక్కలు చేసిన కేసులో నరేశ్ భట్ సంచలన వ్యాఖ్యలు. తాను చంపలేదని, ఆత్మహత్య చేసుకుంటే ముక్కలు చేశానని కోర్టుకు వెల్లడి.
భార్య అదృశ్యమైనట్లు ఫిర్యాదు.. రెండేళ్ల తర్వాత కోర్టులో భర్త సంచలన వాంగ్మూలం!
Virginia: అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో జరిగిన భారత సంతతి మహిళ మమతా కఫ్లే భట్ సంచలనాత్మక హత్య కేసు విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. భార్యను అత్యంత క్రూరంగా ముక్కలుగా నరికి చంపాడనే తీవ్ర ఆరోపణలతో అరెస్టయిన భారత సంతతికి చెందిన నరేశ్ భట్ అమెరికా న్యాయస్థానంలో సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. తాను భార్య మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా నరికి చెత్తలో పడేసిన మాట వాస్తవమేనని, అయితే ఆమెను తాను హత్య చేయలేదని కోర్టుకు తెలిపి అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాడు. ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని న్యాయమూర్తి ఎదుట విచారణలో వాదించాడు.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. వర్జీనియాలో నివసిస్తున్న 28 ఏళ్ల భారత సంతతి మహిళ మమతా కఫ్లే భట్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయినట్లు 2024 ఆగస్టు నెలలో ఆమె భర్త నరేశ్ భట్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన వర్జీనియా పోలీసులు దర్యాప్తు చేపట్టి, వారి పడకగది మరియు బాత్రూమ్‌లో రక్తం చిందిన మరకలను కనుగొన్నారు. తీవ్ర అనుమానంతో నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, మృతురాలి శరీర భాగాలు లభ్యం కావడంతో కేసు విచారణ వేగవంతమైంది.
కోర్టు విచారణ సందర్భంగా నరేశ్ భట్ మాట్లాడుతూ.. ఉదయం తాను నిద్రలేచే సరికే భార్య మంచంపై స్పృహలేకుండా పడి ఉందనై, ఆమె పక్కన పురుగుల మందు ప్యాకెట్ ఉండటంతో ఆత్మహత్య చేసుకుందని భావించి చాలాసేపు సీపీఆర్ (CPR) చేసి కాపాడేందుకు ప్రయత్నించానని చెప్పాడు. ఆమె అప్పటికే మరణించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యానని, తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించినా ధైర్యం చాలలేదని తెలిపాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని దాచాలనే ఉద్దేశంతో రంపంతో ముక్కలుగా నరికి చెత్త సంచుల్లో కుక్కి విసిరేసినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు అదృశ్యమైనట్లు డ్రామా ఆడి ఫిర్యాదు చేశానని వెల్లడించాడు. అతడు చేసిన నేరానికి గాను అమెరికా చట్టాల ప్రకారం జీవిత ఖైదు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు మరియు పోలీసులు స్పష్టం చేస్తున్నారు.




