Iran Israel War Fear: కోరుకోని మరణం...వెంటాడుతున్న యుద్ధభయం

ఇరాన్‌, ఇజ్రాయిల్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలతో సామాన్య ప్రజలు భయాందోళనల్లో జీవిస్తున్నారు. యుద్ధభయం వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ కథనం చెబుతుంది.

Balachander
Published on: 28 May 2026 11:57 AM IST
Iran Israel War Fear: కోరుకోని మరణం...వెంటాడుతున్న యుద్ధభయం
X

Iran Israel War Fear: యుద్ధం అంటే సరిహద్దుల్లో పేలే తుపాకులు, ఆకాశంలో గర్జించే లోహవిహాంగాలు మాత్రమే కాదు... యుద్ధం అంటే ఒక తరం ఆశల సమాధి. యుద్ధం అంటే మనుషుల లక్ష్యానికి చివరి అంకం. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య నడుస్తున్న అంతర్జాతీయ రాజకీయాలు, ఆధిపత్య పోరు ప్రపంచాన్ని మరో మహా యుద్ధం వైపు నెడుతుండవచ్చు. కానీ, క్షిపణుల నీడన బతుకుతున్న మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం) దేశాల సామాన్య ప్రజలకు మాత్రం ఇది నిత్య నరకం. ఏ తప్పూ చేయని లక్షలాది మంది అమాయకులు ఈరోజు గుక్కెడు నీళ్లు, గుప్పెడు మెతుకుల కోసం అల్లాడిపోతున్నారు. ఆధిపత్యం ఒకరిది, అధికారం మరొకరిది... కానీ చావు మాత్రం సామాన్యుడిది.

నిద్రలేని రాత్రులు... ఏ గుండెకూ లేదు భద్రత!

ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన నగరాల్లోని ప్రజలు ఇప్పుడు రాత్రుళ్లు ప్రశాంతంగా కన్ను మూయలేకపోతున్నారు. ఎటు నుంచి ఏ క్షిపణి దూసుకొస్తుందో, ఏ క్షణంలో బాంబుల శబ్దం ఇళ్లను కుప్పకూలుస్తుందో తెలియని తీవ్ర ఆందోళన వారిని వెంటాడుతోంది. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ ఉద్రిక్తతల వల్ల దాదాపు 80 శాతానికి పైగా స్థానిక ప్రజలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ సైనికుల కంటే ఎక్కువగా భయపడుతున్నది చిన్న పిల్లలు, వృద్ధులే. ఈ భూమి ఎవరి సొంతం కాదు. ప్రతి ఒక్కరికీ నివశించే హక్కు ఉంది. ఇలాంటి యుద్ధాల కారణంగానే అంతర్యుద్ధాలు మొదలై ప్రజలు తిరుగుబాటు చేస్తారు. తమకు అనుకూలంగా ప్రజలు నిర్ణయాలు తీసుకునే వరకు రాజకీయనాయకులు ఇలానే చేస్తుంటారు.

ఆకలి కేకలు... బతుకు పోరాటం

యుద్ధం తెచ్చిన అతిపెద్ద శాపం ఆకలి. ఒకప్పుడు సంపన్న దేశాలుగా వెలిగిన ప్రాంతాల్లో కూడా నేడు కనీస వసతులు కరువయ్యాయి. దీనికో ఉదాహరణ ఖతార్‌. మార్కెట్లు మూతపడి, సరఫరా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈరోజు ఉదయం ఆహారం దొరికితే, రాత్రికి దొరుకుతుందో లేదో తెలియని దయనీయ స్థితి నెలకొంది. కేవలం ప్రాణాలు దక్కించుకోవడానికి నిలువ నీడ లేక, చేతిలో రూపాయి లేక వలస బాట పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాజకీయ నాయకులు కుర్చీల్లో కూర్చుని యుద్ధ ప్రకటనలు చేస్తారు. కానీ, ఆ యుద్ధం సృష్టించే శ్మశాన వాటికల్లో తమ వారి శవాల కోసం వెతుక్కునేది మాత్రం సామాన్య పౌరుడే.

మానవత్వానికి పరీక్షా సమయం

ప్రతి మనిషికి ప్రశాంతంగా జీవించే హక్కు ఉంది. కానీ, ఈ కోరుకోని మరణం వారిని బతికుండగానే చంపేస్తోంది. బాంబుల దాడిలో చనిపోయే వారి కంటే, ఆ భయంతో గుండె ఆగి చనిపోతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా తమ స్వార్థ రాజకీయాలను పక్కనబెట్టి, మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తుపాకీ గొట్టాల నుండి శాంతి వచనాలు రావు... కేవలం చర్చల ద్వారానే ఈ రక్తపాతానికి ముగింపు పలకగలరని సామాన్య లోకం కోరుకుంటోంది. చర్చల పేరుతో మధ్యప్రాచ్యంలో హడావుడిగా సమావేశాలు నిర్వహిస్తూ...మరోవైపు మా భద్రకోసమే అంటూ బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ప్రతి దేశం ఇలానే ఆలోచిస్తే ప్రపంచం మనుగడ కష్టమౌతుంది. మనిషి జీవనం అస్తవ్యస్తమౌతుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story