West Asia Crisis: అంతా ట్రంప్‌ చేతుల్లోనే... పశ్చిమాసియా భవిష్యత్తు అగమ్యగోచరమే

West Asia Crisis: పశ్చిమాసియా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఒక హాలీవుడ్‌ రేంజ్‌ సినిమా స్థాయిలో ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చిపడుతున్నాయి.

Balachander
Published on: 23 April 2026 10:12 AM IST
West Asia Crisis
X

West Asia Crisis: అంతా ట్రంప్‌ చేతుల్లోనే... పశ్చిమాసియా భవిష్యత్తు అగమ్యగోచరమే

West Asia Crisis: పశ్చిమాసియా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఒక హాలీవుడ్‌ రేంజ్‌ సినిమా స్థాయిలో ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చిపడుతున్నాయి. అధికారాలు ట్రంప్‌ చేతిలో ఉన్నా... కీలకమైన విషయాలను ఆర్మీ అధికారులు, పెంటగాన్‌ అధికారులు స్వయంగా చూసుకుంటున్నారు. వార్‌ రూమ్‌లోకి కీలక విషయాలను ట్రంప్‌కు చెబితే...ఆయన ఎక్కడ తన సోషల్‌ మీడియాలో ముందుగానే ప్రకటిస్తాడో అని చెప్పి అధికారులు భయపడుతున్నారు. ఆర్మీ పని ఆర్మీ చేసుకుంటూ పోతుంటే... వైట్‌హౌస్‌ మాత్రం సీజ్‌ఫైర్‌, చర్చలు తదితర అంశాలన్నీ పూర్తిగా ట్రంప్‌ చేతుల్లోనే ఉన్నాయని, ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టే తదుపరి అడుగులు ఉంటాయని చెబుతున్నారు.

నో టైమ్‌ లిమిట్‌

బుధవారంతో ముగియాల్సిన సీజ్‌ఫైర్‌ గడువును పెంచుతూ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదేమి తన సొంత నిర్ణయం కాదు. పాకిస్తాన్‌ అభ్యర్థన మేరకు మాత్రమే గడుపు పెంచుతున్నట్టు పేర్కొన్నాడు. గడువు పెంచారు సరే. అది ఎప్పటి వరకు అన్నది స్పష్టం చేయలేదు. గడువు లేని సీజ్‌ఫైర్‌ అంటే అది మరో దేశంపై ఆర్థికభారాన్ని పెంచడమే. సీజ్‌ఫైర్‌ అమలులో ఉన్నప్పటికీ ఆర్థిక దిగ్బంధనం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే ఇరాన్‌ను సైనిక శక్తిపరంగా అడ్డుకోవడం కంటే ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం వలన ఆ దేశం దిగివస్తుందని అమెరికా అంచనా వేస్తోంది. ఇరాన్‌ చమురుపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో చమురు నిల్వలు పేరుకుపోతున్నాయి. వాటని అమ్మేందుకు వీలు కావడం లేదు. దీని వలన రోజుకు 500 మిలియన్‌ డాలర్ల నష్టం వస్తోందని అమెరికా అంచనా.

ఆర్థికంగా ముక్కలు చేయడమే లక్ష్యంగా

ఇరాన్‌ను ఆయుధపరంగా బలపడకుండా చేయాలి అంటే ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలి. ఆదాయం రాకుండా అడ్డుకోవాలి. హోర్ముజ్‌ జలసంధి గుండా చమురు రవాణా జరగకుండా అడ్డుకోవడం వలన ఇరాన్‌ను పలు విధాలుగా ఇబ్బందులు పెట్టొచ్చు. దీనికోసమే అమెరికా తన సైనిక బలగాలను ఈ జలసంధి బయట మోహరించింది. ఈ జలసంధి గుండా వచ్చే నౌకలను అడ్డుకుంటోంది. ఇటీవలే ఇరాన్‌ జెండాతో వస్తున్న నౌకను అమెరికా అడ్డుకుంది. ఈ నౌక చైనా నుంచి వస్తున్నట్టుగా గుర్తించారు. ఇందులో క్షిపణులు తయారు చేయడానికి అవసరమైన రసాయనాలు ఉన్నట్టుగా గుర్తించారు. అంతేకాకుండా, ఇరాన్‌ వెళ్లున్న ఓ విమానాన్ని కూడా అమెరికా రక్షణ రంగం అడ్డుకుందని, అందులో 500 మిలియన్‌ డాలర్ల ధనం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అమెరికా వాదన ప్రకారం ప్రస్తుతం ఇరాన్‌ ఆర్థికంగా చితికిపోయింది. అక్కడి ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు కూడా ఇరాన్‌ వద్ద డబ్బులేదు. మౌలిక వసతులు లేవు. నీళ్లు ఆహారం లేక ప్రజలు తిరగబడుతున్నారు.

కానీ, ఇరాన్‌ వాదన మరోలా ఉంది. అమెరికా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాము తలొగ్గేది లేదని అంటున్నారు. భయపెట్టేకొలది బలంగా ఎదుగుతామని చెబుతున్నారు. ఇరాన్‌ చమురును అమెరికా అడ్డుకోలేదని, ఏదో ఒకరూపంలో ఇరాన్‌ నుంచి చమురు నౌకలు బయటకు వెళ్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక జలసంధిలో ఇరాన్‌ ఏర్పాటు చేసిన సీమైన్స్‌ ఎప్పుడు ఎలా పేలతాయో అనే భయాందోళనలు ప్రపంచదేశాల్లో నెలకొన్నాయి. ఈ రెండు దేశాల యుద్ధం ఎలా ఉన్నా...ఇరాన్‌ నుంచి చమురు రాకుంటే ప్రపంచదేశాలు అల్లాడిపోతాయి. ఇప్పటికే చమురు కొరత కారణంగా ప్రపంచంలోని పలు దేశాలు అలమటిస్తున్నాయి. పలు రంగాలు కుంటుపడ్డాయి. ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పశ్చిమాసియాలో ఇలాంటి పరిస్థితులు ఇంకా కొనసాగితే ప్రపంచదేశాలు ఏకం కావాల్సిన పరిస్థితి వస్తుంది. అమెరికా ఏకాకిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ట్రంప్‌ నిర్ణయాలు ఆదేశానికి గుదిబండలా మారినా ఆశ్చర్యంలేదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story