West Asia War Impact: పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం...చేతులెత్తేస్తున్న లాటిన్ ప్రభుత్వం
ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ అనడానికి ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు నిదర్శనం. ఎక్కడో పశ్చిమాసియా గడ్డపై రగులుతున్న యుద్ధ జ్వాలలు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాటిన్ అమెరికా దేశాల పొయ్యిలను ఆర్పేస్తున్నాయి.
West Asia War Impact: ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ అనడానికి ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు నిదర్శనం. ఎక్కడో పశ్చిమాసియా గడ్డపై రగులుతున్న యుద్ధ జ్వాలలు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాటిన్ అమెరికా దేశాల పొయ్యిలను ఆర్పేస్తున్నాయి. చమురు ధరల మంట సామాన్యుడి కంటికి నీరు తెప్పిస్తోంది. ఇంధనం నుంచి ఆహారం వరకు ప్రతి వస్తువు ధర ఆకాశాన్నంటుతుండటంతో అక్కడి ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఆహార కోరత, అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న ఈ లాటిన్ అమెరికా దేశాలు కొత్తగా పశ్చిమాసియా ప్రభావంతో మరికొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అక్కడి ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా ఈ సమస్యలు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.
అర్జెంటీనా: రవాణా కష్టాలు - 20% పెరిగిన ఇంధన ధరలు
ఇప్పటికే ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న అర్జెంటీనాకు ఈ యుద్ధం పెనుశాపంగా మారింది. జేవియర్ మిలే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ధరల కట్టడికి ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. యుద్ధం మొదలైనప్పటి నుంచి దేశంలో చమురు ధరలు 20 శాతం మేర పెరిగాయి. దీంతో ప్రజారవాణాను కుదించారు. బస్సులను తగ్గించారు. దీంతో ప్రయాణాల కోసం ప్రజలు గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాదు దేశీయ విమాన చార్జీలు కూడా భారీగా పెరిగాయి. ప్రయాణం ఏకంగా 24 శాతం ప్రియమైందిగా నిపుణులు చెబుతున్నారు.
కోస్టారికా & ఈక్వెడార్: పారిశ్రామిక సంక్షోభం
పరిశ్రమలపై ఆధారపడుతున్న కోస్టారికా, ఈక్వెడార్ దేశాల్లో సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇంధన దిగుమతులపై ఆధారపడే కోస్టారికాలో ప్లాస్టిక్, ఫుడ్ ప్యాకేజింగ్ పరిశ్రమలు కుదేలయ్యాయి. ముడిసరకు ధరలు పెరగడంతో వేలమంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇక చమురు ఉత్పత్తి దేశమైన ఈక్వెడార్‌లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. అక్కడ లీటర్ పెట్రోల్ ధర దాదాపు 3 డాలర్లకు చేరడంతో రవాణా సంఘాలు సమ్మె బాట పడుతున్నాయి. ఇలానే ఇంకొంతకాలం కొనసాగితే దేశంలో ప్రజావిప్లవం సంభవించే అవకాశం ఉంటుంది.
మెక్సికో & హైతీ: ఆహార అభద్రత
మెక్సికోలో ద్రవ్యోల్బణం 3.7% నుండి 5%కి పెరిగింది. మెక్సికన్ల ప్రధాన ఆహారమైన 'టోర్టిల్లా' ధరలు పెరగడం సామాన్యులను ఇబ్బంది పెడుతోంది. అటు హైతీలో దాదాపు 58 లక్షల మంది తీవ్రమైన ఆకలితో అలమటిస్తున్నారు. సాయుధ ముఠాల హింసకు తోడు ఇప్పుడు ఇంధన కొరత ఆ దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తోంది. ఈ రెండు దేశాల్లోనూ అంతర్గత సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. మెక్సికోలో డ్రగ్స్ ముఠా చెలరేగిపోతుంటే హైతీలో సాయుధ ముఠాల హింస పేట్రేగిపోతుంది. దీనికి తోడు ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం కూడా కలవడంతో గోటిచుట్టు రోకలిపోటుగా మారింది.
ఇప్పటికే యుద్ధం ముగిసినట్టు అమెరికా ప్రకటించినా...ఇరాన్ నుంచి ఇంకా సానుకూల స్పందన రాకపోవడం, గతంలో మాదిరిగా అంతర్జాతీయ జలాల్లో రవాణా వాణిజ్య నౌకలు ప్రయాణించలేకపోతున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లో సంక్షోభం రోజు రోజుకు పెరిగిపోతున్నది.




