Mojtaba Khamenei Mystery : ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఎక్కడ? అడ్రస్ కోసం గాలిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్

Mojtaba Khamenei Mystery : ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆచూకీ ఇప్పుడు మిస్టరీగా మారింది. పదవి చేపట్టినా ఆయన బయటకు రాకపోవడంతో అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు వేట మొదలుపెట్టాయి.

CR Reddy
Published on: 23 March 2026 10:49 AM IST
Mojtaba Khamenei
X

Mojtaba Khamenei 

Mojtaba Khamenei Mystery : పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన వారసుడిగా పగ్గాలు చేపట్టిన కుమారుడు మోజ్తబా ఖమేనీ ఆచూకీ ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆయన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించి రోజులు గడుస్తున్నా, ఇంతవరకు ప్రపంచానికి ముఖం చూపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు మోజ్తబా బతికే ఉన్నారా? లేక ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడ్డారా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

బాధ్యతలు చేపట్టినా కనిపించని అగ్రనేత

ఇరాన్ మాజీ అగ్రనేత అలీ ఖమేనీ మరణం తర్వాత, మార్చి 9వ తేదీన ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఇరాన్ ప్రకటించింది. యుద్ధం సాగుతున్న తరుణంలో దేశాన్ని నడిపించాల్సిన నేత ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. సాధారణంగా ఇలాంటి కీలక బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రజలనుద్దేశించి ప్రసంగించడం లేదా సీనియర్ అధికారులతో సమావేశం అవ్వడం జరుగుతుంది. కానీ, మోజ్తబా విషయంలో అవేవీ జరగకపోవడంతో ఇరాన్ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

కేవలం రాతపూర్వకంగానే

ఇరాన్ కొత్త ఏడాది సందర్భంగా సుప్రీం లీడర్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని అందరూ ఆశించారు. గతంలో ఆయన తండ్రి ఇదే ఆనవాయితీని కొనసాగించేవారు. కానీ మోజ్తబా కేవలం ఒక రాతపూర్వక సందేశాన్ని మాత్రమే విడుదల చేశారు. ఆయన గొంతు వినబడకపోవడం, వీడియో కనిపించకపోవడంతో ఆయన ప్రాణాలతోనే ఉన్నారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. కొందరు ఆయన ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారని అంటుంటే, మరికొందరు ఆయన అప్పటికే మరణించారని ప్రచారం చేస్తున్నారు.

రంగంలోకి దిగిన సీఐఏ, మొసాద్

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థలైన అమెరికాకు చెందిన సీఐఏ (CIA), ఇజ్రాయెల్‌కు చెందిన మొసాద్ (Mossad) ఇప్పుడు మోజ్తబా ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇరాన్ అధికారులు కొందరు మోజ్తబాను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాల దగ్గర కొన్ని సమాచారాలు ఉన్నప్పటికీ, ఆయన స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. "పరిస్థితి చాలా వింతగా ఉంది.. ఆయన బతికే ఉన్నారని అనిపిస్తున్నా, చురుగ్గా ఉన్నట్లు ఒక్క పక్కా ఆధారం కూడా దొరకట్లేదు" అని ఒక అమెరికా అధికారి వ్యాఖ్యానించారు.

భద్రతా కారణాలే అడ్డంకిగా మారాయా?

మరోవైపు, నిపుణులు మాత్రం మోజ్తబా భద్రతా కారణాల దృష్ట్యానే బయటకు రావడం లేదని విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయెల్ వరుసగా ఇరాన్ అగ్రనేతలను, కమాండర్లను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో, మోజ్తబాను రహస్య ప్రదేశంలో ఉంచి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రాణహాని ఉందని భావించే ఆయనను బంకర్లకు పరిమితం చేసి ఉండవచ్చని సమాచారం. ఏది ఏమైనా, ఆయన బహిరంగంగా కనిపించే వరకు ఇరాన్ లోని రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది.

CR Reddy

CR Reddy

Next Story