Susie Wiles : ట్రంప్ 'కుడిభుజం'కు బ్రెస్ట్ క్యాన్సర్.. అమెరికా అధ్యక్ష కార్యాలయంలో విషాదం

Susie Wiles : వైట్ హౌస్ తొలి మహిళా చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డారు. చికిత్స పొందుతూనే విధుల్లో కొనసాగుతానన్న ఆమె ధైర్యాన్ని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొనియాడారు.

CR Reddy
Published on: 17 March 2026 6:44 AM IST
Susie Wiles
X

 Susie Wiles

Susie Wiles : అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్‌లో అత్యంత కీలకమైన చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన సుసీ వైల్స్ (68) ఇప్పుడు ఒక వ్యక్తిగత సవాలును ఎదుర్కొంటున్నారు. తనకు ప్రాథమిక దశలో ఉన్న రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) సోకినట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. జనవరి 2025లో డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు వెన్నుముకలా నిలిచిన సుసీ వైల్స్, ఈ కష్టసమయంలోనూ తన బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ఇష్టపడలేదు. చికిత్స పొందుతూనే విధుల్లో కొనసాగుతానని ఆమె ప్రకటించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ వేదికగా సుసీ వైల్స్ ధైర్యాన్ని కొనియాడారు. "క్యాన్సర్ లాంటి మహమ్మారితో పోరాడుతూనే దేశం కోసం పనిచేయాలనే ఆమె అంకితభావం గొప్పది. ఆమె త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటుందనే నమ్మకం నాకుంది" అని ట్రంప్ పేర్కొన్నారు. తన చికిత్సకు సంబంధించి వైల్స్ తక్షణమే నిర్ణయం తీసుకున్నారని, దాదాపు ఎక్కువ సమయం ఆమె వైట్ హౌస్‌లోనే గడుపుతారని ఆయన స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీలో ఆమెకు ఉన్న క్రమశిక్షణ, వ్యూహరచనల వల్ల ట్రంప్ హయాంలో వైట్ హౌస్ మరింత పటిష్టంగా పనిచేస్తోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

వ్యాధి నిర్ధారణ అయిన కొద్దిసేపటికే ఆమె వైట్ హౌస్ ఈస్ట్ రూమ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ పక్కనే కనిపించారు. గులాబీ రంగు జాకెట్ ధరించి వచ్చిన ఆమెకు అక్కడున్న వారందరూ ఆత్మీయంగా కౌగిలించుకుని సంఘీభావం తెలిపారు. స్వయంగా అధ్యక్షుడే ఆమె కోసం కుర్చీని పట్టి ఉంచడం అందరినీ ఆకర్షించింది. తన వ్యాధిపై స్పందిస్తూ.. "అమెరికాలో ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి ఈ వ్యాధి వస్తోంది. ఇప్పుడు నేను కూడా ఆ బాధితుల జాబితాలో చేరాను. కానీ సరైన సమయంలో వ్యాధి బయటపడటం నాకు కలిసొచ్చే అంశం" అని వైల్స్ పేర్కొన్నారు.

2024 ఎన్నికల ప్రచారాన్ని అద్భుతంగా నిర్వహించి ట్రంప్‌ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడంలో సుసీ వైల్స్ పాత్ర అమోఘం. కేవలం ఒక రాజకీయ సలహాదారుగానే కాకుండా, ట్రంప్ ప్రభుత్వానికి దిక్సూచిగా ఆమెను పరిగణిస్తారు. ట్రంప్ ఇస్తున్న మద్దతు, ప్రోత్సాహం తనలో కొత్త శక్తిని నింపుతున్నాయని ఆమె ఆ కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యాన్ని అధిగమించి ఆమె విధుల్లో కొనసాగడం వైట్ హౌస్ సిబ్బందికి పెద్ద స్ఫూర్తిగా నిలుస్తోంది.

CR Reddy

CR Reddy

Next Story