West Asia Peace: పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి అడ్డుపడుతున్నదేమిటి?

West Asia Peace: పశ్చిమాసియాలో శాంతి అనేది కలగానే మిగిలిపోతోందా? తాజా పరిణామాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.

Balachander
Published on: 22 April 2026 9:44 AM IST
West Asia Peace
X

West Asia Peace: పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి అడ్డుపడుతున్నదేమిటి?

West Asia Peace: పశ్చిమాసియాలో శాంతి అనేది కలగానే మిగిలిపోతోందా? తాజా పరిణామాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కాల్పుల విరమణను మరోసారి పొడిగించడం తాత్కాలిక ఊరటనిచ్చినప్పటికీ, హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు మాత్రం ప్రపంచ వాణిజ్యాన్ని వణికిస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం పాకిస్తాన్ పర్యటనకు వెళ్తున్న వేళ, ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ పొడిగింపు నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయి.

అసలు చిక్కు ఎక్కడ?

కాల్పుల విరమణ పొడిగించినా, ఇరాన్‌కు మాత్రం ఊరట లభించడం లేదు. అమెరికా నౌకాదళం హోర్ముజ్ జలసంధి వెలుపల తిష్టవేసి, ఇరాన్ జెండాతో ప్రయాణించే నౌకలను సీజ్ చేస్తోంది. "మా డిమాండ్లకు తలొగ్గితేనే ఇక్కడి నుంచి కదులుతాం" అన్నది అమెరికా స్పష్టమైన హెచ్చరిక. దీనివల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ గండి పడుతోంది. అయితే, గల్ఫ్ దేశాలకు, ఇరాన్‌కు మధ్య ఉన్న ప్రాథమిక విభేదాలే ఈ అశాంతికి మూల కారణం. మూలమైన విభేధాలకు పరిష్కారం కనుగొనకుండా పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని ఊహించలేం.

శాంతికి అడ్డుపడుతున్న 3 కీలక అంశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పాలనా విధానం: గల్ఫ్ దేశాలు ముస్లిం దేశాలైనప్పటికీ, కాలంతో పాటు మారుతూ ప్రజాస్వామ్యబద్ధమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయి. సంప్రదాయాలకు విలువ ఇస్తూనే, ఆధునీకతను సంతరించుకుంటున్నాయి. ప్రపంచ దేశాల్లోని సంస్కృతిని కూడా గల్ఫ్‌ దేశాలు ఆహ్వానిస్తున్నాయి. కానీ, ఇరాన్ మాత్రం కఠినమైన షరియా చట్టాలనే నమ్ముకుంది. మహిళలకు స్వేచ్ఛ లేకపోవడంతో పాటు సంప్రదాయవాదం ఆ దేశాన్ని పొరుగు దేశాల నుంచి వేరు చేస్తోంది. ఇటీవల మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, పోరాటాలు చేయడానికి ఇదే కారణం.

తీవ్రవాద ముద్ర: ప్రపంచంలోని పలు ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ వెన్నుదన్నుగా నిలుస్తోందనేది అమెరికా, ఇజ్రాయెల్ ప్రధాన ఆరోపణ. ఈ మద్దతును పూర్తిగా విరమించుకుంటామని ఇరాన్ హామీ ఇవ్వకపోవడమే శాంతి చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా లెబనాన్‌లో పలు తీవ్రవాద సంస్థలకు ఇరాన్‌ నుంచి పూర్తిస్థాయిలో మద్దతు ఉంది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌లోని కొన్ని ఉగ్ర సంస్థలకు కూడా ఇరాన్‌ ఆర్థికంగా, ఆయుధపరంగా మద్దతు ఇస్తోంది. ఈ మద్ధతును పూర్తిగా ఉపసంహరించుకోవాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది.

అణ్వాయుధ భయం: ఏ దేశానికైనా రక్షణ హక్కు ఉంటుంది. కానీ ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తే, అవి తీవ్రవాదుల చేతికి చిక్కుతాయని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుందన్నది అగ్రరాజ్యాల ఆందోళన. పై రెండు అంశాలు ఎలా ఉన్నా. అణ్వాయుధ భయం అతిపెద్దది. అణ్వాయుధాల తయారీ జరిగితే దాని వలన ఇరాన్‌ శతృదేశాలతో పాటు గల్ఫ్‌లోని పలు దేశాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. గల్ఫ్‌లోని సామరస్యం, అభివృద్ధి కుంటుపడుతుంది. అయిల్‌పై అణ్వాయుధం పడితే ఫలితం ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు.

ప్రస్తుత సమయంలో కాల్పుల విరమణ ఒక ఉపశమనం మాత్రమే. శాశ్వత శాంతి కావాలంటే కేవలం ఈ కాల్పుల విరమణ పొడిగింపులు మాత్రమే సరిపోవు. ఇరాన్ తన విధానాలను మార్చుకోవాలి, అటు అమెరికా తన ఆంక్షల పట్టును సడలించాలి. హోర్ముజ్ జలసంధి గుండా వాణిజ్యం సజావుగా సాగకపోతే, అది కేవలం పశ్చిమాసియా సమస్యగానే మిగలదు.. ప్రపంచ ఇంధన ధరలపై పెను ప్రభావం చూపుతుంది. సామాన్యుడి జేబుకు చిల్లు పడకముందే ఈ సంక్షోభానికి తెరపడాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story