Trump Cuba Sanctions: క్యాస్ట్రో కుటుంబమే ట్రంప్ టార్గెట్టా? క్యూబాపై ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు
క్యూబాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆంక్షలు ఎందుకు విధించారు? క్యాస్ట్రో కుటుంబ సభ్యులు, మిలిటరీ ఆధీనంలోని కీలక సంస్థలు ఎందుకు లక్ష్యంగా మారాయి? తెలుసుకుందాం
Trump Cuba Sanctions: అంతర్జాతీయ రాజకీయాల్లో దశాబ్దాల నాటి ప్రచ్ఛన్న యుద్ధ వైరం మళ్లీ ముదిరింది. క్యూబాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తున్న మిలిటరీ వ్యాపార సామ్రాజ్యాన్ని, అలాగే ఆ దేశ మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరికొత్త ఆంక్షలను ప్రకటించింది. క్యూబా నిరంకుశ పాలనకు అందుతున్న నిధులను అడ్డుకోవడమే తమ వ్యూహమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. వాషింగ్టన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలను మరింత పెంచింది.
ఆంక్షల పరిధిలోకి వచ్చిన సంస్థలు
అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన నూతన జాబితా ప్రకారం, క్యూబా ఆర్థిక వ్యవస్థకు ఊపిరిగా ఉన్న కొన్ని కీలక విభాగాలపై నిషేధం విధించారు. తాజా ప్యాకేజీలో భాగంగా క్యూబా ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఐదు కంపెనీలను, అలాగే క్యాస్ట్రో కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షల చరిత్ర చాలా పాతది. 1962 ఫిబ్రవరిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ హయాంలో ప్రారంభమైన ఈ సుదీర్ఘ ట్రేడ్ ఎంబార్గో నేటికీ కొనసాగుతుండటం విశేషం. ఈసారి అమెరికా నేరుగా క్యాస్ట్రో కుటుంబానికి గురిపెట్టింది. క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో కుమారుడు, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి అలెజాండ్రో క్యాస్ట్రో ఎస్పిన్ భార్య అనాలీ లిలియం రుయెడా కార్డెరో పై అమెరికా ఆంక్షలు విధించింది.
ఏంటి ఈ ‘గేసా’? అమెరికా ఎందుకు భయపడుతోంది?
క్యూబా ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం అక్కడి మిలిటరీ నియంత్రణలోనే నడుస్తుంది. దీనిని నడిపించేదే ‘గేసా’ అనే ఒక భారీ వ్యాపార కూటమి. అమెరికా ఆంక్షలు విధించిన ఐదు సంస్థలలో... అల్మాసిన్స్ యూనివర్సల్స్, రాఫిన్, బ్యాంకో ఫైనాన్సియరో ఇంటర్నేషనల్ అనే మూడు ప్రధాన సంస్థలు నేరుగా ఈ మిలిటరీ గ్రూప్‌తో ముడిపడి ఉన్నాయి. వీటితో పాటు జియోమినెరా, ఎంప్రెసా సిడెరుర్జికా జోస్ మార్టి అనే మరో రెండు భారీ కంపెనీలను కూడా అమెరికా కట్టడి చేసింది.
సామాన్యుడిపై పడుతున్న భారం
అమెరికా ఆర్థిక వ్యవస్థతో గానీ, డాలర్ చెల్లింపులతో గానీ క్యూబాకు ఎలాంటి సంబంధం లేకుండా చేయడమే ట్రంప్ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అయితే, ఈ ఆంక్షల వల్ల క్యూబా పాలకుల కంటే అక్కడి సామాన్య ప్రజలే నిత్యావసరాల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంతర్జాతీయ నిపుణులు విమర్శిస్తున్నారు. రాజకీయ సంస్కరణలు తీసుకురావడంలో పాత ఆంక్షలు పెద్దగా పనిచేయకపోయినా, ట్రంప్ ప్రభుత్వం మాత్రం క్యూబా విషయంలో పాత కఠిన వైఖరినే కొనసాగించాలని నిర్ణయించుకుంది. క్యాస్ట్రో కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఆర్థిక వనరులను దెబ్బతీయడం ద్వారా క్యూబా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని పూర్తిగా మోకాళ్లపైకి తెచ్చే వ్యూహంతో అమెరికా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే క్యూబాకు చైనా, రష్యాలు వెన్నుదన్నుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా ఆంక్షలు విధిస్తున్న ప్రపంచంలో కమ్యునిజాన్ని అభిమానించే దేశాలు క్యూబాకు రక్షణగా నిలుస్తున్నాయి.




