US Iran Nuclear War Fears: చెప్పిన మాటకు అమెరికా కట్టుబడి ఉంటుందా? జపాన్‌ దృశ్యం పునరావృతమౌతుందా?

US Iran Nuclear War Fears: తుఫానుకు ముందు ఉండే నిశ్శబ్ధం ఎంత భయంకరంగా ఉంటుందో అంచనా వేయడం కష్టం. అటువంటి పరిస్థితే పశ్చిమాసియాలో కూడా నెలకొంది.

Balachander
Published on: 25 April 2026 10:41 AM IST
US Iran Nuclear War Fears
X

US Iran Nuclear War Fears

US Iran Nuclear War Fears: తుఫానుకు ముందు ఉండే నిశ్శబ్ధం ఎంత భయంకరంగా ఉంటుందో అంచనా వేయడం కష్టం. అటువంటి పరిస్థితే పశ్చిమాసియాలో కూడా నెలకొంది. ఒకవైపు శాంతి మంత్రం వినిపిస్తున్నా... తెర వెనుక మాత్రం భీకర యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకవైపు చర్చలు అంటూనే, మరోవైపు అమెరికా తన అమ్ములపొదిలోని మూడు భారీ విమాన వాహక నౌకలను హోర్ముజ్ జలసంధి వద్ద మోహరించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

మాట నిలబడుతుందా.. మడమ తిరుగుతుందా?

ట్రంప్‌ వైట్‌ హౌస్‌లో మీడియాతో మాట్లాడాడు. ఇరాన్‌పై అణ్వాయుధాలు వాడే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాడు. ఇప్పటికే ఇరాన్‌ను తమ వద్ద ఉన్న సంప్రదాయ యుద్ధ పద్దతుల్లో దెబ్బతీశామని, ఇరాన్‌ కోలుకునే పరిస్థితులు లేవని, ఇరాన్‌ ఎగిరెగిరి పడుతున్నా వాస్తవం అందుకు భిన్నంగా ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు, అణ్వాయుధాల వాడకాన్ని తాము ఎప్పటికీ ప్రోత్సహించబోమని తెలిపారు. ట్రంప్‌ నోటివెంట శాంతి వచనాలు వెల్లువలా వచ్చినా...ఆయన చరిత్ర తెలిసినవారు మాత్రం ఈ మాటలను అంత తెలికగా నమ్మలేకపోతున్నారు. ఇటీవల ఇండియా చైనాలు నరకప్రాయమైన దేశాలు అని చెప్పిన కొద్దిసేపటే మాట మార్చేశారు. ఇండియా తమకు మిత్ర దేశమని చెప్పుకొచ్చారు. ఒకమాటపై కట్టుబడి ఉండకుండా క్షణానికి ఒకమాట మార్చడం ట్రంప్‌ నైజం. ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా ఇలానే మారుతుంటాయి.

1945 నాటి ఆ చేదు జ్ఞాపకం..

ట్రంప్‌ ఇప్పుడు కూడా మాట తప్పుతారా అనే అనుమానం కలగడానికి బలమైన చారిత్రక కారణం ఉంది. 1945 ఆగస్టు 6 మరియు 9 తేదీల్లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణ్వాయుధాలను ప్రయోగించి ప్రపంచాన్ని వణికించింది. ఆ తరువాత ఏ దేశం కూడా ఇప్పటి వరకు మరోదేశంపై అణ్వాయుధం ప్రయోగించలేదు. అటువంటి పరిణామాలు ఎదురు కాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, ఇప్పుడు గనుక చర్చలు విఫలమై, ఇరాన్ తన పంతం నెగ్గించుకోవాలని అమెరికా నౌకలపై దాడికి దిగితే, ట్రంప్ తన పాత పద్ధతిలోనే 'ప్రతీకారం' తీర్చుకుంటారా అన్న భయం పట్టుకుంది. ఇలాంటి ఆలోచనలు ట్రంప్‌కు ఉన్నాయా లేవా అన్నది ఆయనకు తప్పించి మరెవ్వరికీ తెలియదు. పైగా యూరప్‌ దేశాలు, నాటో దేశాలు కూడా ట్రంప్‌ నిర్ణయాలను వ్యతిరేకిస్తుండటం, ఇరాన్‌ విషయంలో సానుభూతి ప్రకటిస్తుండటం కూడా ట్రంప్‌కు నచ్చడం లేదు.

ఇరాన్ వద్ద ‘గుట్టు’ ఉందా?

అమెరికా హెచ్చరికలకు ఇరాన్ లొంగకపోవడానికి కారణం వారి వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం. ఒకవేళ ఇరాన్ ఇప్పటికే రహస్యంగా అణ్వాయుధాన్ని సిద్ధం చేసుకుని ఉంటే, ఈ పోరు ఇరు దేశాల మధ్యే కాకుండా ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా మూడు విమాన వాహక నౌకలను సిద్దం చేసింది. సముద్రంలో మైన్లు అమర్చే ఇరాన్‌ నౌకలను కాల్చేయాలని ట్రంప్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాడు. అంతేకాకుండా ఒప్పందం కుదుర్చుకోకపోతే సమయం మించిపోతుందని ట్రూత్‌ సోషల్‌ వేదికగా హెచ్చరించారు. సమయం మించిపోతుంది అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటన్నది ఆసక్తికరం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story