Nuclear Attack: ఇరాన్‌పై అణు పంజా విసరనున్న అమెరికా? భారత్‌కు బిగ్ షాక్ తప్పదా?

Nuclear Attack: ఇరాన్‌లోని పిక్‌యాక్స్ పర్వతంపై అమెరికా అణుదాడి ముప్పు? భారత్, పాకిస్థాన్‌కు రేడియేషన్ ముప్పుపై అంతర్జాతీయ రక్షణ నిపుణుల విశ్లేషణ.

Arun Chilukuri
Published on: 4 Nov 2026 12:11 PM IST
Nuclear Attack
X

Nuclear Attack: ఇరాన్‌పై అణు పంజా విసరనున్న అమెరికా? భారత్‌కు బిగ్ షాక్ తప్పదా?

Nuclear Attack: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు తీవ్రంగా అలముకుంటున్న వేళ అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్‌లోని అణు కేంద్ర లక్ష్యాలపై అమెరికా మరోసారి దాడులకు దిగుతుందా, ఒకవేళ దాడి చేస్తే వ్యూహాత్మకంగా అణ్వాయుధాన్ని ఉపయోగిస్తుందా అనే ప్రశ్నలు అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ముఖ్యంగా ఇరాన్‌లోని పిక్‌యాక్స్ పర్వత శ్రేణులపై అణుదాడి జరిగే అవకాశాలు ఉన్నాయంటూ అంతర్జాతీయ విశ్లేషకులు చేస్తున్న హెచ్చరికలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ అణుదాడి గనుక జరిగితే దాని నుంచి వెలువడే ప్రమాదకర రేడియోధార్మికత పాకిస్థాన్ మీదుగా భారత వాయవ్య సరిహద్దు రాష్ట్రాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇరాన్‌లోని కీలకమైన నటాంజ్ అణు సంక్లిష్ట కేంద్రానికి అత్యంత సమీపంలో పిక్‌యాక్స్ పర్వతం ఉంది. ఈ పర్వతం లోపల భూమికి సుమారు 100 మీటర్ల లోతులో ఇరాన్ నిర్మించిన భారీ సొరంగాల సముదాయం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ తన అత్యంత రహస్య అణు శుద్ధి కార్యక్రమాలను ఈ పర్వత లోతుల్లోనే కొనసాగిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో డోనాల్డ్ ట్రంప్ ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవాల్సి రావచ్చు అని పలుమార్లు చేసిన వ్యాఖ్యలు, అవసరమైతే గంటలోనే దాడి చేయగలమని తాజాగా పేర్కొనడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

మరోవైపు ప్రముఖ అమెరికన్ వ్యాఖ్యాత టక్కర్ కార్ల్‌సన్ సైతం సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒత్తిడి కారణంగా అమెరికా ఇరాన్‌పై అణుదాడికి సిద్ధమవుతోందని ఆరోపించారు. అయితే దీనికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు, అమెరికా ప్రభుత్వం కూడా అణు ప్రయోగానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

అయితే ఒకవేళ పిక్‌యాక్స్ పర్వతంపై భూగర్భ అణు పేలుడు సంభవిస్తే దాని పరిణామాలు భారత్‌కు కూడా తాకే అవకాశం ఉందని రక్షణ నిపుణుడు సందీప్ ఉన్నితన్ విశ్లేషించారు. అణు పేలుడు వల్ల ఉత్పన్నమయ్యే రేడియోధార్మిక పదార్థాలు గాలి దిశను బట్టి పాకిస్థాన్ సరిహద్దు దాటుకుని భారతదేశంలోని పంజాబ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, గుజరాత్ ప్రాంతాలకు స్వల్ప మోతాదులో చేరవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

దూరం పెరిగేకొద్దీ తీవ్రత తగ్గినప్పటికీ, వాతావరణంలో వర్షాలు పడే ప్రాంతాల్లో ఈ రేడియోధార్మిక కణాలు స్థానికంగా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. ఏదేమైనా ఇరాన్‌పై అణుదాడి జరిగితే దాని పర్యవసానాలు పర్షియన్ గల్ఫ్‌కే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక, పర్యావరణ వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.