World Mosquito Day 2026: దోమ కాటు నుంచి ప్రాణాంతక వ్యాధుల వరకు.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ప్రపంచ దోమల దినోత్సవం 2026 సందర్భంగా మలేరియా, డెంగ్యూ, ఫైలేరియాసిస్, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు, లక్షణాలు, నివారణ చర్యల గురించి తెలుసుకుందాం.
World Mosquito Day 2026: వర్షాకాలం ప్రారంభం కాగానే మురుగు నీరు, నిల్వ నీటి ప్రదేశాలు పెరిగి దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయి. సాధారణంగా దోమ కాటు అనగానే కేవలం దురద, చికాకు అనుకుంటాం. కానీ, ఒక చిన్న దోమ కాటు మలేరియా, డెంగ్యూ, బోద వ్యాధి, మెదడు వాపు వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందనేది చేదు నిజం. వ్యాధి లక్షణాలను ముందే గుర్తించడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా మన ప్రాణాలను రక్షించుకోవచ్చు.
మలేరియా ... చలి జ్వరం ప్రమాదం
అనాఫిలీస్ ఆడ దోమ కుట్టడం ద్వారా 'ప్లాస్మోడియం' అనే సూక్ష్మజీవి రక్తంలోకి ప్రవేశిస్తుంది. దోమ కుట్టిన 10 నుండి 14 రోజులకు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఇది చలిదశ (15 నిమిషాల నుండి గంట), వేడిదశ (2 నుండి 6 గంటలు), చెమటదశ (2 నుండి 4 గంటలు) అనే మూడు దశల్లో బాధిస్తుంది. ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్ వల్ల వచ్చే 'సెరెబ్రల్ మలేరియా' మెదడుకు సోకి ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా గర్భిణులు తొలి మూడు నెలలు వైద్యుల సలహా లేకుండా మందులు వాడకూడదు.
డెంగ్యూ ...పగటిపూట కుట్టే టైగర్ దోమ
ఆర్బోవైరస్ వల్ల వచ్చే డెంగ్యూ వ్యాధిని ఏడిస్ ఈజిప్టై అనే దోమలు వ్యాప్తి చేస్తాయి. ఇవి ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడతాయి. మన ఇళ్లలోని ఎయిర్ కూలర్లు, పూలకుండీలు, పాత టైర్లలో ఏడు రోజులకు పైగా నిల్వ ఉన్న మంచి నీటిలోనే ఇవి గ్రుడ్లు పెడతాయి. తీవ్రమైన నొసటి తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కండరాల నొప్పులు దీని ముఖ్య లక్షణాలు.
బోద వ్యాధి (ఫైలేరియాసిస్) ... మెదడు వాపు
క్యూలెక్స్ దోమల వల్ల వ్యాపించే బోద వ్యాధి ప్రాణాలు తీయకపోయినా, జీవితాంతం అంగవైకల్యాన్ని మిగుల్చుతుంది. మన దేశంలో దాదాపు 53 లక్షల మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారని అంచనా. ఫైలేరియా క్రిములు శరీరంలో 10 ఏళ్ల పాటు ఉండి కాళ్లు, చేతులు, అవయవాల వాపునకు కారణమవుతాయి. దీనికి 'డి.ఇ.సి' మందులను బరువును బట్టి 12 రోజుల పాటు వాడాల్సి ఉంటుంది. అలాగే జపనీస్ బి వైరస్ వల్ల వచ్చే మెదడు వాపు వ్యాధి సెప్టెంబరు నుండి డిసెంబరు మధ్య 1 నుండి 14 ఏళ్ల పిల్లలకు ఎక్కువగా సోకుతుంది.
చికెన్ గున్యా
ఈ వ్యాధి ఈడస్ దోమల కాటు వలన వ్యాపిస్తుంది. ఈ దోమ కుట్టిన తరువాత విపరీతమైన జ్వరంతో పాటు కీళ్లనొప్పులు వస్తాయి. అయితే, ఈ కీళ్ల నొప్పులు రెండు మూడు రోజులు కాకుండా నెలల తరబడి వేధిస్తాయి. అయితే, జ్వరం, కీళ్ల నొప్పుల సమస్యలు వచ్చినా... ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య కొంత తక్కువే అని చెప్పాలి. దీర్ఘకాలికంగా కీళ్ల నొప్పులకు కారణమైతే ఆర్త్రైటిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వ చర్యలు ... తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రభుత్వం జాతీయ మలేరియా కార్యక్రమం కింద 1,386 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 10,562 ఉపకేంద్రాల ద్వారా ఉచిత రక్తపరీక్షలు, చికిత్స అందిస్తోంది. ఇందులో 470 కేంద్రాలు 24 గంటలూ సేవలు అందిస్తున్నాయి.
దోమల నివారణకు ప్రతీ వారం ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే పాత్రలను ఖాళీ చేసి 'డ్రై డే' పాటించాలి. నీటి గుంటల్లో గంబూసియా (గప్పి) చేపలను వదలడం లేదా వాడిన ఇంజన్ ఆయిల్ చుక్కలు వేయడం ద్వారా లార్వాలను అరికట్టవచ్చు. నిద్రించే సమయంలో దోమతెరలు వాడటం, సాయంత్రం వేళల్లో కిటికీలకు జాలీలు అమర్చుకోవడం ద్వారా ఈ తీవ్ర వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.




