T-Rex Fossil Auction: ప్రపంచంలోనే ఖరీదైన డైనోసార్... రికార్డు స్థాయిలో వేలం
ప్రపంచంలో అత్యంత భయంకరమైన జీవి టైరన్నోసారస్ రెక్స్ శిలాజాన్ని ఓ సంస్థ వేలం వేసింది. ఈ వేలంలో ఈ డైనోసార్ రికార్డు స్థాయిలో అమ్ముడయింది. భారీ మొత్తానికి ఎవరు కొనుగోలు చేశారన్నది మిస్టరీగా మారింది.
T-Rex Fossil Auction: భూమిపై మానవజాతి ఆవిర్భవించడానికి కోట్లాది సంవత్సరాల ముందే అంతరించిపోయిన డైనోసార్ల ప్రపంచం ఎప్పుడూ ఒక మిస్టరీనే. ఆ కాలానికి చెందిన అతిపెద్ద హింసాత్మక జంతువు టైరన్నోసారస్ రెక్స్ అస్థిపంజరం ఒకటి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఊహించని రికార్డులను తిరగరాసింది. న్యూయార్క్‌లోని ప్రముఖ సోథెబీస్ వేలం సంస్థ నిర్వహించిన ప్రతిష్టాత్మక అమ్మకంలో, దాదాపు 6.7 కోట్ల సంవత్సరాల నాటి ఒక భారీ టీ-రెక్స్ శిలాజం ఏకంగా 50.1 మిలియన్ డాలర్లకు భారతీయ కరెన్సీలో సుమారు రూ. 420 కోట్లకు అమ్ముడుపోయింది. చరిత్రలో ఒక డైనోసార్ అస్థిపంజరానికి ఇంతటి భారీ మొత్తాన్ని చెల్లించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఎవరీ 'గస్'? దీని వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏమిటి?
ఈ టీ-రెక్స్ శిలాజానికి శాస్త్రవేత్తలు ప్రేమగా "గస్" అని నామకరణం చేశారు. 2021వ సంవత్సరంలో అమెరికాలోని సౌత్ డకోటా రాష్ట్రంలోని ఒక మారుమూల వ్యవసాయ క్షేత్రంలో ఈ అస్థిపంజరాన్ని కనుగొన్నారు. 12 అడుగులకు పైగా ఎత్తు ఉన్న ఈ జీవి ఎముకలలో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ భాగం సురక్షితంగా లభించడం విశేషం. ఇప్పటివరకు కనుగొన్న టీ-రెక్స్ శిలాజాలలో అత్యంత పరిపూర్ణమైన రూపం ఇదేనని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ శిలాజాన్ని బయటకు తీయడానికి శాస్త్రవేత్తల బృందం వరుసగా మూడు సంవత్సరాల పాటు వేసవి కాలంలో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అక్కడ శీతాకాలంలో గడ్డకట్టే మంచు కరిగి, నేల మెత్తబడినప్పుడే తవ్వకాలు జరపడం వీలవుతుంది. ఆ తర్వాత లాబొరేటరీలో దీని ఎముకలను అమర్చి పూర్తి రూపానికి తీసుకురావడానికి మరో మూడేళ్లు పట్టింది. ఈ సుదీర్ఘ ప్రక్రియలో పరిశోధకులకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ డైనోసార్ తలపై పంటి గాయాలు, అలాగే పక్కటెముకలు విరిగి మళ్లీ అతుక్కున్న గుర్తులు ఉన్నాయి. దీనిని బట్టి ఈ భీకర జంతువు తన జీవితకాలంలో ఇతర డైనోసార్లతో తీవ్రమైన పోరాటాలు చేసి ఉంటుందని స్పష్టమవుతోంది.
బిలియనీర్ల కొత్త క్రేజ్.. సైన్స్ సమాజంలో ఆందోళన!
సాధారణంగా కళాఖండాలు, పురాతన పెయింటింగులను సేకరించే ప్రపంచ కుబేరులకు ఇప్పుడు డైనోసార్ శిలాజాలను కొనుగోలు చేయడం ఒక సరికొత్త హోదాగా మారింది. గతంలో 2024లో అపెక్స్ అనే స్టెగోసారస్ శిలాజం అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించగా, ఇప్పుడు 'గస్' ఆ రికార్డును దాటి 50 మిలియన్ డాలర్ల మార్కును దాటిన మొదటి శిలాజంగా అవతరించింది.
అయితే ఈ అరుదైన శిలాజాన్ని దక్కించుకున్న ఆ అజ్ఞాత బిలియనీర్ ఎవరనేది సోథెబీస్ సంస్థ ఇంకా వెల్లడించలేదు. ఈ తరహా వేలాల వల్ల అత్యంత విలువైన చారిత్రక నమూనాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే, వాటిపై పరిశోధనలు చేసుకునే అవకాశం సైన్స్ రంగానికి కోల్పోతామని కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ, గతంలో అపెక్స్ శిలాజాన్ని కొనుగోలు చేసిన అమెరికన్ బిలియనీర్ కెన్నెత్ గ్రిఫిన్ దానిని మ్యూజియానికి ఉచితంగా అప్పగించినట్లే, ఈ 'గస్' కూడా త్వరలోనే సామాన్య ప్రజల సందర్శన కోసం ఏదో ఒక జాతీయ మ్యూజియంలో కొలువుదీరవచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అరుదైన శిలాజాలు భారీ వేలంలో అమ్ముడవుతుండటంతో బ్లాక్ మార్కెట్ దందా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




