US vs Iran : డబ్బులు ఇస్తేనే డీల్ అంటున్న ఇరాన్.. అణు బాంబు ఊసే ఎత్తొద్దంటున్న ట్రంప్

US vs Iran : అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ట్రంప్ కఠిన షరతులు, ఇరాన్ సవాల్‌తో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. అణు ఒప్పందం కుదరకపోతే నరకం చూపిస్తామని ఇరు దేశాలు హెచ్చరించుకుంటున్నాయి.

CR Reddy
Published on: 26 May 2026 8:00 AM IST
US vs Iran
X

US vs Iran

US vs Iran : పశ్చిమాసియాలో పరిస్థితులు ఏ నిమిషంలోనైనా చేయిదాటిపోయేలా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇరాన్ తన అణు కార్యకలాపాలను పూర్తిగా పక్కన పెట్టాలని, తన దగ్గరున్న యురేనియంను 60 రోజుల్లోగా అప్పగించాలని ట్రంప్ గడువు విధించారు. ఒకవేళ తన షరతులకు లొంగకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. అణు బాంబు తయారు చేయాలనే ఆలోచనను ఇరాన్ మానుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చించిన తర్వాత ట్రంప్ మరింత దూకుడు పెంచారు. ఇరాన్ తమ షరతులకు అంగీకరిస్తే ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య శాంతి కోసం కుదిరిన అబ్రహం ఒప్పందంలో చోటు కల్పిస్తామని ఆఫర్ ఇచ్చారు. అయితే, ఇరాన్ మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తోంది. అమెరికా తమపై విధించిన ఆంక్షలు తొలగించి, ఫ్రీజ్ చేసిన నిధులను విడుదల చేస్తేనే ఏదైనా ఒప్పందం కుదురుతుందని భీష్మించుకు కూర్చుంది. కాగితం మీద చేసే వాగ్దానాలను తాము నమ్మబోమని, చేతల్లో చూపించాలని ఇరాన్ అధ్యక్షుడు పేజెస్కియాన్ డిమాండ్ చేస్తున్నారు.

అమెరికా హెచ్చరికలకు ఇరాన్ సైన్యం కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ఒకవేళ అమెరికా గనుక తమపై దాడికి దిగితే ఆ దేశానికి నరకం చూపిస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) చీఫ్ అహ్మద్ వాహిదీ హెచ్చరించారు. గత 47 ఏళ్ల వైరుధ్యానికి ఈసారి యుద్ధంతోనే ముగింపు పలుకుతామని, తమ సైన్యం వేలు ఎప్పుడూ ట్రిగ్గర్ పైనే ఉంటుందని మొహసిన్ రిజాయ్ పేర్కొన్నారు. తాము అణు బాంబు తయారు చేయడం లేదని, కానీ దేశ గౌరవం కోసం యుద్ధానికి వెనకాడబోమని ఇరాన్ నేతలు చెబుతున్నారు.

మరోవైపు, పశ్చిమాసియాలో అమెరికా తన సైనిక శక్తిని భారీగా పెంచుతోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా యుద్ధ విమానాలు, రీఫ్యూయలింగ్ విమానాలు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి యుద్ధం వస్తే ఇరాన్ లోపలికి వెళ్లి మరి దాడులు చేసేలా అమెరికా ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. హార్ముజ్ జలసంధిని ఏ శక్తి ఆపలేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. 72 గంటల్లో ఏదో ఒక అద్భుతం జరగకపోతే పరిస్థితులు భీకరంగా మారుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఖమేనీ అజ్ఞాతంలోకి.. ఏం జరగబోతోంది?

అమెరికా నిఘా సంస్థల సమాచారం ప్రకారం, ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఒక రహస్య ప్రాంతం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. అమెరికా నుంచి వస్తున్న ప్రతిపాదనలకు బదులివ్వడంలో ఇరాన్ అధికారుల మధ్య సమన్వయం లోపించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ కూడా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. చర్చలు ఫలించి శాంతి కుదురుతుందా? లేక మూడో ప్రపంచ యుద్ధానికి ఇది పునాది వేస్తుందా? అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story