G3 Alliance: ప్రపంచ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం.. G-3 కూటమికి జిన్‌పింగ్‌ పిలుపు!

అమెరికా, చైనా, రష్యాతో జీ-3 కూటమి ఏర్పాటు చేయాలంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రతిపాదించారు. ప్రపంచ శాంతి, అణ్వాయుధాల తగ్గింపు, అంతర్జాతీయ భద్రతపై ట్రంప్‌, పుతిన్‌తో చర్చలు జరిపారు

Rudrachander
Published on: 19 Nov 2026 6:26 PM IST
G3 Alliance: ప్రపంచ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం.. G-3 కూటమికి జిన్‌పింగ్‌ పిలుపు!
X

G3 Alliance: ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి తెరలేచింది. అమెరికా, చైనా, రష్యా.. ఈ మూడు అగ్రశక్తులు కలిసి అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఈ మూడు దేశాలతో కూడిన ‘జీ-3’ ఆలోచనను ముందుకు తెచ్చారు. ప్రపంచ శాంతి, భద్రతను కాపాడటంలో ఈ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ఈ భేటీని చరిత్రాత్మక సమావేశంగా అభివర్ణించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా పాల్గొన్న ఈ చర్చలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

మూడు అగ్రశక్తులు.. ఒకే వేదికపై

చైనాలోని షెన్‌జెన్‌లో ఏపెక్‌ (APEC) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ త్రైపాక్షిక భేటీ జరిగింది. దీనిని అంతర్జాతీయ మీడియా ‘యాల్టా 2.0’గా పేర్కొంటోంది. 1945లో జరిగిన యాల్టా సమావేశం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకంగా నిలిచింది. అప్పట్లో సోవియట్‌ యూనియన్‌, పాశ్చాత్య దేశాల ప్రభావ పరిధులు ఖరారయ్యాయి. ఇప్పుడు అదే తరహాలో ప్రపంచంలోని ప్రధాన శక్తులు తమ ప్రభావాన్ని విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయా? అనే చర్చ మొదలైంది. ఈ సమావేశంలో జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. అమెరికా, చైనా, రష్యా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలని గుర్తుచేశారు. ప్రపంచంలోని ప్రధాన శక్తులుగా ఈ మూడు దేశాలపై ప్రత్యేక బాధ్యత ఉందన్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో పరస్పరం సహకరించుకోవాలని, ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని కాపాడాలని సూచించారు. మానవాళి పురోగతికి మరింత తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.

ట్రంప్‌ ఏమన్నారు?

ఈ సమావేశంపై ట్రంప్‌ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా, రష్యా, చైనా అధ్యక్షులు ఒకే వేదికపై సమావేశం కావడం చారిత్రక పరిణామమని పేర్కొన్నారు. ఈ పర్యటన వల్ల తొలిసారిగా మూడు దేశాల నేతలతో త్రైపాక్షిక చర్చలకు అవకాశం లభించిందని, ఈ సమావేశంతో చరిత్ర సృష్టిస్తున్నామని అన్నారు. అంతేకాదు, అణ్వాయుధాల సంఖ్యను తగ్గించే అంశంపై కూడా మూడు దేశాలు చర్చించగలవని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మూడు దేశాలు ఇవేనని, ఆయుధ నిల్వలను తగ్గించడంతో పాటు వాటి వినియోగం వల్ల తలెత్తే ప్రమాదాలను నివారించడంలో కలిసి పనిచేయగలవని చెప్పారు. అయితే అణ్వాయుధాల తగ్గింపు అంత సులభం కాదని కూడా అంగీకరించారు.

‘యాల్టా 2.0’ వెనుక అసలు లక్ష్యం ఏమిటి?

ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చొరవ తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచాన్ని వివిధ దేశాల ప్రభావ పరిధులుగా విభజించుకునే దిశగా ఈ ముగ్గురు నేతలు ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో అబుదాబిలో జరిగిన చర్చల్లోనూ యూరప్‌ కోసం కొత్త భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని రష్యా ట్రంప్‌ యంత్రాంగం ముందు ప్రస్తావించినట్లు సమాచారం. అయితే జీ-3 ప్రతిపాదన ఇప్పటికిప్పుడు అమల్లోకి వచ్చిన కూటమి కాదు. ఇది జిన్‌పింగ్‌ ముందుకు తెచ్చిన ఆలోచన మాత్రమే. మూడు దేశాల మధ్య వ్యూహాత్మక విభేదాలు, పరస్పర ప్రయోజనాలు, ప్రాంతీయ ఆధిపత్య పోటీ వంటి అంశాలు ఈ ప్రతిపాదనకు పరీక్షగా నిలవనున్నాయి. ముఖ్యంగా అణ్వాయుధాల తగ్గింపు, యూరప్‌ భద్రత, అంతర్జాతీయ సంక్షోభాల పరిష్కారంపై ఈ దేశాలు ఎంతవరకు ఒకే అభిప్రాయానికి వస్తాయన్నదే కీలకం. ఈ భేటీ కేవలం దౌత్యపరమైన సమావేశంగా మిగిలిపోతుందా? లేక ప్రపంచ రాజకీయాల్లో కొత్త శక్తి సమీకరణానికి పునాది వేస్తుందా? అన్నది రానున్న పరిణామాలే తేల్చాలి.

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు