Yemen War: యెమెన్‌లో కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు... హౌతీల చుట్టు బిగుస్తున్న ఉచ్చు

గల్ఫ్‌లో రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. ముఖ్యంగా యెమెన్‌లో హౌతీలకు, ప్రభుత్వ దళాలకు మధ్య యుద్ధం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Balachander
Published on: 28 July 2026 11:03 AM IST
Yemen War: యెమెన్‌లో కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు... హౌతీల చుట్టు బిగుస్తున్న ఉచ్చు
X

Yemen War: గత నాలుగు సంవత్సరాలుగా పాక్షిక శాంతితో నడుస్తున్న యెమెన్ దేశంలో మళ్లీ పూర్తిస్థాయి యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. యెమెన్‌లోని సాయుధ హౌతీ తిరుగుబాటుదారులు తమ ఆధిపత్యాన్ని విస్తరించేందుకు సైనిక సమీకరణను వేగవంతం చేయడంతో అక్కడ ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై క్షిపణి దాడులు చేయడం, స్థానిక ప్రభుత్వ బలగాలతో తలపడటంతో ప్రాంతీయ భద్రత తీవ్ర ప్రమాదంలో పడింది.

వివాదానికి మూలకారణాలు

సౌదీ అరేబియాకు చెందిన రెండు చమురు నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఓడరేవుల ఆంక్షలను ఉల్లంఘించినందుకే ఈ దాడి చేశామని హౌతీలు ప్రకటించారు. ఇక ఇదిలా ఉంటే అటు యెమెన్‌ నైరుతి ప్రాంతమైన ధలే ప్రావిన్స్‌లో ప్రభుత్వ బలగాలకు, హౌతీలకు మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల్లో ఇరువైపులా 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు, అల్-జౌఫ్ ప్రావిన్స్‌లో గిరిజన నాయకుడు హమద్ అల్-హజ్మీని 50 రోజుల పాటు హౌతీలు అక్రమంగా నిర్బంధించడంతో, వేలాది మంది గిరిజనులు హౌతీ అణచివేతకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. 2014 తర్వాత హౌతీలు ఇంతటి గిరిజన నిరసనను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు అనుకూలంగా ఉన్న వర్గాలు ఇప్పుడు హౌతీలకు వ్యతిరేకత కావడంతో హౌతీల విజయం అంత సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.

మారిన వ్యూహాత్మక సమీకరణాలు

సనా రాజధానిగా వాయువ్య యెమెన్‌ను ఏలుతున్న హౌతీల వద్ద 2,000,000 మందికి పైగా పోరాట యోధులు, ఆధునిక క్షిపణి వ్యవస్థలు ఉన్నప్పటికీ, ఈసారి వారికి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. గతంలో అంతర్గత విభేదాలతో బలహీనపడిన యెమెన్ ప్రభుత్వ దళాలు, ఇప్పుడు సౌదీ అరేబియా మద్దతుతో ఒకే తాటిపైకి వచ్చాయి. ఈ దాడుల వెనుక ఇరాన్ ప్రమేయం ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. హౌతీల వెనుక ఉన్న ఇరాన్‌పై భారీ సైనిక చర్య ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్‌లో యుద్ధం జరగుతుండగా... ఇరాన్‌ అండదండలు ఉన్న హౌతీపై యెమెన్‌ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యెమెన్‌లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. యుద్ధకాండ వైపు అడుగులు వేస్తున్న హౌతీల వ్యూహాలు ఈసారి పారకపోవచ్చని, అంతర్జాతీయ భద్రతా బలగాలు, స్థానిక దళాల ఉమ్మడి చర్యలతో హౌతీల చుట్టూ ఉచ్చు బిగుస్తోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story