Zelensky Putin Talks: శాంతి వైపు అడుగులా? వ్యూహాత్మక చదరంగమా?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు పుతిన్‌తో నేరుగా చర్చలకు జెలెన్‌స్కీ సిద్ధమయ్యారు. శాంతి చర్చలు, అమెరికా పాత్ర, యూరప్ భవిష్యత్తుపై సమగ్రమైన విశ్లేషణ
Zelensky Putin Talks: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై నాలుగేళ్లు దాటినా ఎప్పుడూ లేనంత ఆసక్తికరమైన, అనూహ్యమైన మలుపు ఇప్పుడు చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ నేరుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ముఖాముఖి చర్చల కోసం బహిరంగ లేఖ రాయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు యుద్ధ భూమిలో డ్రోన్ దాడులు జరుగుతుండగానే, మరోవైపు ఈ "శాంతి మంత్రం" పఠించడం వెనుక బలమైన వ్యూహాత్మక కారణాలు కనిపిస్తున్నాయి. ఈ బహిరంగ లేఖ నిజంగానే చర్చలకు ఆహ్వానించడం కోసమేనా లేదంటే అగ్నిలో మరింత ఆజ్యం పోసేందుకు వేస్తున్న ఎత్తుగడలా అనే కోణంలో విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
మారిన అమెరికా వైఖరి...ఉక్రెయిన్‌పై తగ్గిన మమకారం
ప్రస్తుతం అమెరికా దృష్టిమొత్తం యూరప్ కంటే కూడా ఇరాన్, మధ్యప్రాచ్యంపైనే ఉన్నది. ఇలాంటి సమయంలో అమెరికాను పదేపదే వేడుకున్నా ఎలాంటి లాభం ఉండని ఉక్రెయిన్ గ్రహించింది. అమెరికా వ్యవహారాలు ఆసియా ఖండంచుట్టూనే తిరుగుతున్నాయని జెలెన్‌స్కీ బహిరంగంగా అంగీకరించారు. ఇలాంటి సమయంలో అమెరికా కోసం వేచి చూస్తే...ఉక్రెయిన్ పెద్ద ఎత్తున నష్టపోవలసి వస్తుంది. ఇటీవల కాలంలో రష్యా మరింత దూకుడును పెంచుతూ దాడులు చేస్తున్నది. ఆ దాడులకు తట్టుకోవడం ఉక్రెయిన్‌కు సవాల్‌గా మారింది. దీంతో ఓ మెట్టుదిగి రష్యాతో నేరుగా తేల్చుకోవడమే మేలని భావిస్తున్నారు. భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత శతృవులు, మిత్రులు ఉండరని, కేవలం ప్రయోజనాలే ఉంటాయని ఉక్రెయిన్‌కు అర్థమైంది. దీనిని అర్ధం చేసుకున్నాక కూడా అమెరికా కోసమే వేచి చూస్తుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవని గ్రహించి బహుశా లేఖ రాసి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
లేఖలో వ్యంగ్యం... చేతల్లో దూకుడు!
సంధి చేసుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు ఎవరైనా సరే ఒక మెట్టుదిగి జాగ్రత్తగా లేఖ రాస్తారు. కానీ, జెలెన్‌స్కీ తన లేఖలో అలాంటి కనిపించలేదు. పైగా తన మార్కు వ్యంగ్యాన్ని, ధిక్కారాన్ని కూడా స్పష్టంగా కనిపించేలా రాశారు. ఈ లేఖలో పుతిన్ వయసు గురించి మాట్లాడటం విశేషం. ఆయన 26 ఏళ్లుగా అధికారంలో ఉంటున్నారని, వయసు పైబడటం వలన వచ్చే ప్రభావం ఆయనపై స్పష్టంగా కనిపిస్తోందని ఎత్తిపొడుపులు పొడిచాడు. ఒకవేళ రష్యా సంధికి సిద్దంగా ఉన్నా ఇలాంటి వ్యాఖ్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. అందులోనూ పుతిన్‌ను ఇలాంటి మాటలతో ఎత్తిపొడిస్తే దాని పరిణామం తీవ్రంగా ఉంటుంది. లేఖ రాస్తున్న సమయంలోనే ఉక్రెయిన్ రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ శివార్లలో డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడులను జెలెన్‌స్కీ మర్యాదపూర్వక సందర్శన అంటూ చమత్కరించడం కొసమెరుపు. కొంతమంది ఈ మాటను జెలెన్‌స్కీ ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు నిదర్శనమని చెబుతుంటే...మరికొందరు రష్యా ఆగ్రహానికి గురికావలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఫైనల్‌గా ఈ యుద్ధం నుంచి బయటపడటానికి భయపడకండి అంటూ పుతిన్‌కు సవాల్ విసరడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. రష్యా యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నా...ఉక్రెయిన్ అందుకు సిద్ధంగా ఉన్నదా అంటే లేదు అనే అనుమానాలున్నాయి.
జెలెన్‌స్కీ ప్రతిపాదనపై పుతిన్ స్పందన రష్యా పాత వ్యూహాన్నే ప్రతిబింబిస్తోంది. మే 2024తో జెలెన్‌స్కీ పదవీకాలం ముగిసిందని, కాబట్టి ఆయన అసలైన ప్రతినిధా కాదా అనేది చట్టపరంగా తేలాలంటూ పుతిన్ కొత్త వివాదాన్ని లేవనెత్తారు. ఉక్రెయిన్‌లో మార్షల్ లా అమలులో ఉండటం వల్లే ఎన్నికలు జరగలేదనే వాస్తవాన్ని పక్కనబెట్టి, చర్చల నుండి తప్పించుకోవడానికి లేదా ఉక్రెయిన్‌ను తక్కువ చేసి చూపడానికి మాస్కో ప్రయత్నిస్తోంది.
భూభాగాలపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
శాంతి చర్చలు జరగాలంటూనే ఇరుపక్షాలు తమ పంతాలను వీడటం లేదు. డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా అనే నాలుగు ప్రాంతాల నుండి ఉక్రెయిన్ తప్పుకోవాలని, నాటోలో చేరబోనని ప్రకటించాలని పుతిన్ కోరుతున్నారు. పైగా, అమెరికా ఇరాన్ బిజీలో ఉంది కాబట్టి, ఉక్రెయిన్ చేత భూభాగాలను త్యాగం చేయించేలా ఈయూ ఒత్తిడి తేవాలని పుతిన్ భావిస్తున్నారు. ఎలాంటి భూభాగాలను వదులుకునే ప్రసక్తి లేదని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఇప్పుడు భూమిని ఇస్తే, భవిష్యత్తులో రష్యా మళ్లీ దాడి చేయడానికి దారి తీస్తుందని ఉక్రెయిన్ వాదిస్తోంది.
ట్రంప్ పాత్ర .... భవిష్యత్తు
ఈ మొత్తం ఎపిసోడ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన కూడా కీలకంగా మారింది. ఇద్దరు నేతలూ కూర్చుని చర్చించుకొని సామసర్యానికి రావాలని, అది చాలా మంచి విషయమని ఆయన చెప్తున్నారు. కానీ ఆ రాజీ ఏంటనేది మాత్రం ఆయన దాటవేశారు. జెనీవా, అబుదాబి, ఇస్తాంబుల్ చర్చలు విఫలమైన నేపథ్యంలో స్విట్జర్లాండ్ లేదా టర్కీ వేదికగా ముఖాముఖి కూర్చోవాలన్న ఉక్రెయిన్ ప్రతిపాదన మంచిదే. కానీ, రష్యా తన దురాక్రమణ వైఖరిని వీడకుండా, ఉక్రెయిన్ తన సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టకుండా ఈ యుద్ధానికి ముగింపు పలకడం అంత సులువు కాదు. ఈ లేఖ ద్వారా జెలెన్‌స్కీ తాము శాంతిని కోరుకుంటున్నామని ప్రపంచానికి చాటిచెప్పారు, ఇప్పుడు బంతి పుతిన్ కోర్టులోనే ఉంది! ఈ లేఖపై పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




