Zelenskyy Putin Warning: పుతిన్‌ మనసులోని లక్ష్యాన్ని బయటపెట్టిన జెలెన్‌స్కీ...యూరప్‌లో ఆందోళన

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సోవియట్ యూనియన్ తరహా ఆధిపత్యం కోసం రష్యా ప్రయత్నిస్తోందని, బాల్టిక్ దేశాలు, మోల్డోవాకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.

Rudrachander
Published on: 10 Nov 2026 6:36 PM IST
Zelenskyy Putin Warning: పుతిన్‌ మనసులోని లక్ష్యాన్ని బయటపెట్టిన జెలెన్‌స్కీ...యూరప్‌లో ఆందోళన
X

Zelenskyy Putin Warning: ఉక్రెయిన్‌పై యుద్ధంతో ఆగిపోకుండా, ఐరోపాలోని మరికొన్ని దేశాలపై కూడా రష్యా తన ఆధిపత్యాన్ని విస్తరించాలనుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లక్ష్యం కేవలం ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించడం కాదని, గతంలో సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న దేశాలపై మళ్లీ పట్టు సాధించడమేనని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా మోల్డోవా, బాల్టిక్ దేశాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌కు యూరప్ దేశాలు అందిస్తున్న మద్దతు తగ్గితే, రష్యా మరింత దూకుడుగా వ్యవహరించే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌కు మద్దతు తగ్గితే రెండు ప్రమాదాలు

డెన్మార్క్‌కు చెందిన DR Nyheder మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ యూరప్ ముందున్న రెండు పరిణామాలను వివరించారు. మొదటి పరిస్థితిలో రష్యా సైబర్ దాడులు, డ్రోన్ల చొరబాట్లు, విధ్వంసక చర్యలు వంటి హైబ్రిడ్ దాడులను పెంచవచ్చని చెప్పారు. మోల్డోవా, రొమేనియా, బల్గేరియా, జర్మనీ, ఫిన్లాండ్, డెన్మార్క్ వంటి దేశాల్లో ఇప్పటికే ఇలాంటి కార్యకలాపాలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు తగ్గితే ఈ చర్యలు మరింత విస్తృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రెండో పరిణామం మరింత తీవ్రమైనదని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. రష్యా తన ప్రభావాన్ని బాల్టిక్ దేశాలు, మోల్డోవా వరకు విస్తరించేందుకు ప్రయత్నిస్తే నాటో సభ్య దేశాల భద్రతకు ముప్పు ఏర్పడవచ్చన్నారు. అలాంటి పరిస్థితిలో నాటో స్పందించాల్సి వస్తుందని, అమెరికా సహా యూరప్ దేశాలు నేరుగా సంక్షోభంలోకి లాగబడే అవకాశం ఉందని వివరించారు. బాల్టిక్ సముద్రంపై రష్యా ఆంక్షలు విధించే ప్రమాదాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

డాన్‌బాస్‌ను వదులుకునేందుకు జెలెన్‌స్కీ నిరాకరణ

శాంతి ఒప్పందం కోసం ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలనే ప్రతిపాదనలను జెలెన్‌స్కీ వ్యతిరేకించారు. గతంలో డాన్‌బాస్ గురించి మాట్లాడిన రష్యా, ఆ తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఆక్రమించేందుకు ప్రయత్నించిందని గుర్తుచేశారు. రష్యా తన సైనిక చర్యలకు రష్యన్ భాష మాట్లాడే ప్రజల రక్షణను కారణంగా చూపిందని, కానీ బుచా వంటి ప్రాంతాల్లో హత్యలు, చిత్రహింసల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. డాన్‌బాస్‌ను అప్పగిస్తే శాశ్వత శాంతి వస్తుందనే హామీ లేదని ఆయన వాదన. ఒకటి, రెండు లేదా ఐదేళ్ల విరామం తర్వాత కూడా రష్యా మళ్లీ దాడికి దిగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. నాటో సభ్యత్వానికి సమానమైన భద్రతా హామీలు ఇస్తామన్నా, అవి పూర్తిస్థాయి సభ్యత్వానికి ప్రత్యామ్నాయం కాలేవని అభిప్రాయపడ్డారు.

కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ప్రతిపాదన

యుద్ధాన్ని త్వరగా ఆపాలంటే ప్రస్తుతం ఇరు దేశాల సైన్యాలు ఉన్న ప్రాంతాల్లోనే కాల్పులు నిలిపివేసి, ఆ తర్వాత చర్చలు ప్రారంభించాలని జెలెన్‌స్కీ సూచించారు. ఈ ప్రక్రియ నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగినా, ముందుగా ప్రాణనష్టం ఆగడం ముఖ్యమని చెప్పారు. అయితే సమగ్ర ఒప్పందం కుదిరే వరకు కాల్పులు ఆపేది లేదని పుతిన్ చెబితే, రష్యాకు నిజంగా యుద్ధం ముగించాలనే ఉద్దేశం లేదని అర్థమవుతుందని వ్యాఖ్యానించారు

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు