Kadapa: వీఆర్వో సాయంతో కోదండ రాముడి ఆస్తులు స్వాహా!

Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లా వీరబల్లి మండలం మట్లి గ్రామంలో దేవుడి భూముల మహా కుంభకోణం బట్టబయలైంది.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 31 May 2026 9:04 AM IST
Kadapa
X

Kadapa: వీఆర్వో సాయంతో కోదండ రాముడి ఆస్తులు స్వాహా!

Kadapa: వీరబల్లి మండలంలోని మట్లి గ్రామంలో ప్రాచీన శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి చెందిన వందలాది ఎకరాల భూమి అక్రమంగా చేతులు మారిన మహా భూ కుంభకోణం వెలుగుచూసింది. పూర్వ కాలంలో స్వామివారి నిత్య నైవేద్యాలు, రక్షణ కోసం రాజులు ఇచ్చిన 436 ఎకరాల 19 సెంట్ల (రామలింగాపురం అగ్రహారం) భూమిని కొందరు స్వార్థపరులు, ఓ మాజీ రెవెన్యూ అధికారి (VRO) సాయంతో లూటీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విలేజ్ రికార్డులలో (RSR) స్పష్టంగా "శ్రీరామకవచం" అని ఉన్న దేవుడి ఇనాం భూములను, ఆన్‌లైన్ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని దొంగతనంగా 'జిరాయితీ పట్టా' భూములుగా మార్చేశారు. చట్టపరమైన ఎలాంటి హక్కులు లేకపోయినా.. ఆలయం ఉన్న సర్వే నెంబర్ 2164తో పాటు చుట్టుపక్కల ఉన్న 2112, 2118/A, 2118/B, 2195 సర్వే నెంబర్ల భూములను సిబ్యల శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరిట ఆన్‌లైన్ రికార్డుల్లోకి ఎక్కించేశారు.

ఇంతటి తో ఆగకుండా, ఈ దేవుడి భూములను మట్లి, పెద్దవీడు సహకార సంఘాలలో (PACS) తాకట్టు పెట్టి లక్షల రూపాయల బ్యాంకు లోన్లు కూడా పొందినట్లు ఈసీ, అడంగల్ ఆధారాలతో సహా బయటపడింది.

ఈ అన్యాయంపై కుందేటి నరేంద్ర నాయుడు అనే భక్తుడు పక్కా లీగల్ ఆధారాలతో పోరాటానికి దిగారు. శ్రీరామచంద్రుని మందిరాన్ని, దేవుడి ఆస్తులను కాపాడటమే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం దేవుడి సేవ కోసం ఇచ్చిన "కట్టడి ఇనాం" భూములను అమ్మడానికి గానీ, తాకట్టు పెట్టడానికి గానీ ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు.

వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్, దేవదాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఈ అక్రమ ఆన్‌లైన్ రికార్డులను రద్దు చేయాలని, దేవుడి భూములపై అక్రమంగా లోన్లు ఇచ్చిన బ్యాంకుల వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భక్తులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story