Kadapa: జిల్లెల్లలో టీబీ నిర్ధారణా శిబిరం!
Kadapa: జిల్లెల్లలో అత్యాధునిక హ్యాండ్-హెల్డ్ ఎక్స్-రే, కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతతో 103 మందికి ఉచిత టీబీ పరీక్షలు నిర్వహించారు.
Kadapa: జిల్లెల్లలో టీబీ నిర్ధారణా శిబిరం!
Kadapa: టీబీ ముక్త్ భారత్ 2.0 కార్యక్రమంలో భాగంగా దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జిల్లెల్ల గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక టీబీ నిర్ధారణా శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 103 మందికి హ్యాండ్-హెల్డ్ ఎక్స్-రే ద్వారా ఛాతీ పరీక్షలు నిర్వహించి, టీబీని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు వైద్య సిబ్బంది చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా అత్యాధునిక హ్యాండ్-హెల్డ్ ఎక్స్-రే పోర్టబుల్ పరికరాన్ని వినియోగించారు. చిన్న పరిమాణంలో ఉండే ఈ పరికరాన్ని మారుమూల గ్రామాలకు సులభంగా తీసుకెళ్లి అక్కడికక్కడే వైద్య సేవలు అందించవచ్చని వైద్య సిబ్బంది తెలిపారు.
ఈ పరికరంతో ఛాతీ ఎక్స్-రే తీసిన అనంతరం కేవలం 30 సెకన్లలోనే చిత్రం కంప్యూటర్‌లో అందుబాటులోకి వస్తుందని, అనంతరం కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత సహాయంతో మరో నిమిషంలోనే రిపోర్టు సిద్ధమవుతుందని వివరించారు. మొత్తం పరీక్షా ప్రక్రియ రెండు నిమిషాల్లోనే పూర్తవడం వల్ల అనుమానితులను వెంటనే గుర్తించి అవసరమైన తదుపరి పరీక్షలు నిర్వహించి చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుందని తెలిపారు.
టీబీ నియంత్రణలో ఈ హ్యాండ్-హెల్డ్ ఎక్స్-రే పరికరం కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజలు దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి టీబీ లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. టీబీ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రాజగోపాల్, ఆరోగ్య పర్యవేక్షకులు వీరాంజనేయులు, ఆరోగ్య సహాయకుడు రవికుమార్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ సురేష్, ఎస్టీఎల్ఎస్ బ్రహ్మారెడ్డి, సీహెచ్వోలు ఇలవరసి, పవిత్ర, శ్యామల, ఆరోగ్య కార్యకర్తలు వనజ, మేరీ సుజాత, ఆశా కార్యకర్తలు లక్ష్మీదేవి, సుధారాణి, మంజుల, ప్రమీల తదితర ఆరోగ్య సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




