Rayachoti: రైతుగా పుట్టడం నేరమా? అన్నమయ్య జిల్లాలో కరువు ప్యాకేజీకి డిమాండ్!
Rayachoti: అన్నమయ్య జిల్లాలో తీవ్ర వర్షాభావం. కరువు మండలాలుగా ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రాయచోటిలో ఏపీ రైతు సంఘం డిమాండ్.
Rayachoti: రైతుగా పుట్టడం నేరమా? అన్నమయ్య జిల్లాలో కరువు ప్యాకేజీకి డిమాండ్!
Rayachoti: "రైతుగా పుట్టడం ఒక నేరమా?" అనే అంశంతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్నమయ్య జిల్లా కమిటి ఆధ్వర్యంలొ అంబేద్కర్ విగ్రహంవద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. రైతు ఎంత కష్టపడి వ్యవసాయం చేసినా చేతికి గిట్టుబాటు ధర రావడంలేదని, రైతుగా పుట్టడమే శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా రబీ సీజన్ పూర్తై ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికి, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో తగినంత వర్షపాతంలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఖరీఫ్ సాగు కోసం రైతులు అప్పులుచేసి వేరుశెనగ విత్తనాలు, వరి విత్తనాలు కొనుగోలుచేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.
రాయచోటి ప్రాంతంలో ప్రధానంగా మామిడి, వేరుశెనగ, సన్‌ఫ్లవర్, వరి పంటలు సాగు చేస్తుండగా, మదనపల్లె, పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో ఉద్యాన పంటలు, ముఖ్యంగా టమోటా సాగు అధికంగా జరుగుతుందని తెలిపారు.
వర్షాభావం కారణంగా బోర్లు ఎండిపోవడం, చెరువుల్లో నీరు లేకపోవడంవల్ల రైతులు తీవ్రసంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. ఖరీఫ్ సీజన్ దెబ్బతింటే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని రంగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి అన్నమయ్య జిల్లాను వర్షాభావ జిల్లాగా ప్రకటించి, రైతులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, సాగునీటి సదుపాయాలు, పంటల పెట్టుబడి సాయం, వడ్డీలేని రుణాలు, నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించి ఖరీఫ్ సీజన్‌ను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను కోరారు. ఈ ప్రాంతంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, రైతులు తీసుకున్న క్రాప్ లోన్లు రెండు లక్షలవరకు మాఫీచేసి రైతుకు తర్వాతి సీజన్లో ఏవేవి ఉపయోగపడతాయో అవన్నికూడా పెట్టుబడి సహాయం కింద 90 శాతంతో మంజూరుచేసి వారిని కాపాడాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం సలహాదారులు రామాంజనేయులు, రాయచోటి ఏరియా అధ్యక్షులు హరినాథ్ నాయుడు, భాస్కర్ నాయుడు, నాగయ్య, రవి రైతులు తదితరులు పాల్గొన్నారు..




