Chinnakampalli: ప్రభుత్వ స్కూల్‌లో కలకలం.. తాగునీటిలో విషం కలిపినట్లు ఆరోపణలు!

Chinnakampalli: కేవీ పల్లి మండలం చిన్నకంపల్లి ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు తాగి ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉంది.

RAVI, PILERU
Published on: 1 Aug 2026 10:00 PM IST
Chinnakampalli
X

Chinnakampalli: ప్రభుత్వ స్కూల్‌లో కలకలం.. తాగునీటిలో విషం కలిపినట్లు ఆరోపణలు!

చిన్నకంపల్లి: అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కె.వి.పల్లి మండలం చిన్నకంపల్లి ప్రభుత్వ పాఠశాలలో శనివారం కలకలం చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు అందించిన తాగునీటిలో గుర్తుతెలియని విషపదార్థం కలిపి ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది.

తాగునీరు తాగిన అనంతరం ముగ్గురు విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకోవడంతో పాటు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే వారిని మహల్ క్రాస్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపినట్లు సమాచారం. వైద్యులు విద్యార్థులకు అత్యవసర చికిత్స అందిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకుని విచారణ ప్రారంభించారు. తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి గల అసలు కారణం ఏమిటన్న దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ సంఘటనతో చిన్నకంపల్లి గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.

ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.

RAVI, PILERU

RAVI, PILERU

Next Story