Rayachoti: : వరి సాగుకు ప్రత్యామ్నాయంగా లాభదాయక పంటలు వేయాలి.. మంత్రి!
Rayachoti: :అన్నమయ్య జిల్లా రాయచోటి మాసాపేట మార్కెట్ యార్డులో కిసాన్ మేళా-2026 జరిగింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని రైతులకు కీలక సూచనలు చేశారు.
Rayachoti: : వరి సాగుకు ప్రత్యామ్నాయంగా లాభదాయక పంటలు వేయాలి.. మంత్రి!
రాయచోటి: రాయచోటి మాసాపేట మార్కెట్ యార్డులో కిసాన్ మేళా–2026లో భాగంగా రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులు, కాలానుగుణ సాగు మెలకువలు, శాస్త్రీయ విధానాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, అధిక ఆదాయం సాధించే విధంగా రైతులు వ్యవసాయంలో మార్పులు తీసుకురావాలని సూచించారు.
రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని మంత్రి పిలుపునిచ్చారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించి భూమి సారాన్ని కాపాడుకోవడంతో పాటు రైతులు, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా పంటల సాగు ఉండాలని తెలిపారు.
ఒకే రకమైన పంటపై ఆధారపడకుండా మార్కెట్లో మంచి డిమాండ్, ధర ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా వరి పంట సాగును మాత్రమే నమ్ముకోకుండా తక్కువ నీటితో పండే పంటలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ఇతర లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని కోరారు.
అదేవిధంగా ఆహారపు అలవాట్ల విషయంలోనూ ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని మంత్రి సూచించారు. తెల్ల బియ్యం వంటి అధిక కార్బోహైడ్రేట్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుందని, అందువల్ల వరితో పాటు చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని కూడా ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు.
వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు, శాస్త్రీయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలు, సాంకేతిక సహకారం, యాంత్రీకరణ సదుపాయాలను వినియోగించుకుని వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు.
రైతులకు అవసరమైన అవగాహన, సాంకేతిక సహకారం అందించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని మంత్రి తెలిపారు. రైతు ఆర్థికంగా బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాసాపేట మార్కెట్ యార్డ్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, మార్కెట్ యార్డ్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




