Rayachoty: రాయచోటిలో రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం

Rayachoty: అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని రాయచోటిలో ఏపీ రైతు సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 24 July 2026 11:30 PM IST
Rayachoty
X

Rayachoty: రాయచోటిలో రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం

రాయచోటి: అన్నమయ్య జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శుక్రవారం రాయచోటి తహసీల్దార్ కార్యాలయం పక్కనగల అంబేద్కర్ విగ్రహం వద్ద రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, రైతుల సమస్యలపై ముఖాముఖి చర్చించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రబీ సీజన్‌లో ఎంతో వ్యయప్రయాసలతో సాగు చేసిన పంటలు చేతికిరాక తీవ్రనష్టాలు చవిచూశామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 20 రోజులు గడిచినా జిల్లాలో సరైన వర్షాలు కురవకపోవడంతో సాగు పనులు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. వర్షాలు వస్తాయనే ఆశతో చెనిక్కాయ విత్తనాలు సిద్ధం చేసుకున్న రైతులు, వరినారుకోసం వడ్లుకూడా కొనుగోలుచేసి ఉంచినప్పటికి వర్షాభావం కారణంగా నారుమడులు పోయలేక తీవ్రఆందోళనలో ఉన్నామని చెప్పారు.

రైతుల సమస్యలు విన్న అనంతరం రంగారెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు దేశానికి అన్నంపెట్టే రైతులపట్ల మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

రైతుల ఆత్మహత్యలను అరికట్టాలంటే వెంటనే రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని, బ్యాంకుల ద్వారా కొత్త రుణాలను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు పెట్టుబడి సాయంగా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వ్యవసాయ అవసరాలను 90 శాతం సబ్సిడీతో అందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం సలహాదారు రామాంజనేయులు, రైతులు రామచంద్రారెడ్డి, వెంకట మల్లప్ప నాయుడు, జయరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story