Badvel: హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదు

Badvel: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్‌లో దళిత హక్కుల పోరాట సమితి (DHPS) ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీ ధర్నా జరిగింది.

B. ARUN KUMAR, BADVEL
Published on: 15 Jun 2026 9:28 PM IST
Badvel
X

Badvel: హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదు

బద్వేల్: దళితుల సమస్యల పరిష్కారం, ఎస్సీ–ఎస్టీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, దళిత సంక్షేమ పథకాల పునరుద్ధరణ తదితర డిమాండ్లతో దళిత హక్కుల పోరాట సమితి (DHPS) బద్వేల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కానగల మునెయ్య, జిల్లా అధ్యక్షుడు నాగదాసరి ఇమ్మానియేల్, ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, పట్టణ కార్యదర్శి బాలు ఓబయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 2024 ఎన్నికల సందర్భంగా టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, ఉపాధి, విద్య, స్వయం ఉపాధి, భూమి పంపిణీ, గృహ స్థలాల కేటాయింపు తదితర అంశాలపై అనేక హామీలు ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వాటి అమలులో నిర్లక్ష్యం కొనసాగుతోందని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న తరుణంలో దళితులకు ఇచ్చిన హామీలను విస్మరించడం దారుణమని పేర్కొన్నారు. వెంటనే దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించి అమలు చేయాలని, ఎస్సీ–ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తిగా ఆయా వర్గాల అభివృద్ధికే వినియోగించాలని డిమాండ్ చేశారు.

అలాగే అర్హులైన దళిత కుటుంబాలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు కేటాయించాలని, భూమిలేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాల సాగుభూమి అందించాలని, నిరుద్యోగ దళిత, గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, స్వయం ఉపాధి పథకాలకు తగిన నిధులు కేటాయించాలని కోరారు.

దళిత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడం, విద్యార్థులకు విద్యా సహాయం, విదేశీ విద్య, ఉన్నత విద్య పథకాలను పునరుద్ధరించడం, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడం, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ధర్నా అనంతరం ఆర్డీఓ కార్యాలయ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దళితుల సమస్యలను పరిష్కరించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని డీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కానగల మునెయ్య హెచ్చరించారు.

ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ కార్యదర్శి పడిగే వెంకటరమణ అధ్యక్షత వహించగా, ప్రసాదు, పెంచలయ్య, కృపా, తిరుమల వెంకటరమణ, చంద్రగుప్త, వెంకటయ్య తదితర నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story