Mydukur: ఘనంగా కడప జిల్లా స్థాయి యువజనోత్సవాల ముగింపు వేడుకలు!

Mydukur: కడప జిల్లా మైదుకూరు వైవీయూలో ముగిసిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు. ప్రతిభ చాటిన యువతకు ప్రశంసాపత్రాలు అందజేసిన మెజిస్ట్రేట్ డాక్టర్ పసుపులేటి శంకర్.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 1 Oct 2026 10:00 AM IST
Mydukur
X

Mydukur: ఘనంగా కడప జిల్లా స్థాయి యువజనోత్సవాల ముగింపు వేడుకలు!

Mydukur: మనసును రంజింపజేసే శక్తి ఒక్క కళకే ఉందని మైదుకూరు స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ డాక్టర్ పసుపులేటి శంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ‘స్టెప్’ (STEP) ఆధ్వర్యంలో నగరంలోని యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) అన్నమయ్య సెమినార్ హాల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాల ముగింపు వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా ముగిశాయి.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శంకర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని విభిన్న రంగాల ప్రతిభా పాటవాలు కలిగిన యువతను గుర్తించేందుకు ఇలాంటి ఉత్సవాలు ఎంతో దోహదపడతాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఉల్లాసం పెంపొందుతుందని చెప్పారు. జిల్లా స్థాయిలో రాణించిన వారు రాష్ట్ర స్థాయిలో, అక్కడ ప్రతిభ చాటిన వారు జాతీయ స్థాయిలో అవకాశాలు దక్కించుకోవాలని ఆకాంక్షించారు.

​వైవీయూ రెక్టార్ ఆచార్య దాము మాట్లాడుతూ యువత ఇలాంటి మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాజీ రిజిస్ట్రార్ ఆచార్య పద్మ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన వారు అక్కడి నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండి, జాతీయ స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. ఈ సభలో స్టెప్ సీఈవో ప్రసాదరావు, మేనేజర్ సుబ్బారాయుడు తదితరులు ప్రసంగించారు.

​అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన యువతీ యువకులకు ముఖ్య అతిథి డాక్టర్ పసుపులేటి శంకర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన సుమన, విజయభారతి, పద్మ, రియాజున్నిసా, మృత్యుంజయరావులను స్టెప్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 300 మంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేడుకలు జాతీయ గీతాలాపనతో ముగిశాయి.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR