Duvvuru: దువ్వూరులో స్మార్ట్ కిచెన్, పంట పొలాల పరిశీలన: డీపీఎం ప్రవీణ్ కుమార్
Duvvuru: దువ్వూరులో స్మార్ట్ కిచెన్, పంట పొలాలను పరిశీలించిన ప్రకృతి వ్యవసాయ డీపీఎం ప్రవీణ్ కుమార్.. రసాయన రహిత సేంద్రియ ఆహారంతోనే ఆరోగ్యం చేకూరుతుందన్నారు.
Duvvuru: దువ్వూరులో స్మార్ట్ కిచెన్, పంట పొలాల పరిశీలన: డీపీఎం ప్రవీణ్ కుమార్
దువ్వూరు: రసాయనాల్లేని ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతోనే పిల్లలకు, ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ (DPM) ఎస్.పి. ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. దువ్వూరు పట్టణంలోని స్మార్ట్ కిచెన్ సెంటర్‌ను మండల వ్యవసాయ అధికారి (AO) అమర్నాథ్ రెడ్డితో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మండలంలో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తరణ, ఈ-క్రాప్ (e-Crop) నమోదు, APAIMS తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం స్మార్ట్ కిచెన్ ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఇక్కడ 'సూర్య మండల నమూనా' పద్ధతిలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించాలని అధికారులను ఆదేశించారు. కిచెన్ గార్డెన్ ద్వారా నాణ్యమైన, విషరహిత తాజా కూరగాయలను పిల్లలకు పౌష్టికాహారంగా అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి ఇంట్లోనూ కుటుంబ అవసరాల కోసం పెరటి తోటలు వేసుకునేలా ప్రజలను, రైతులను చైతన్యపరచాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.
అనంతరం వెంకుపల్లె, నీలాపురం గ్రామాల్లో డీపీఎం ప్రవీణ్ కుమార్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. అక్కడ రైతులు సాగు చేసిన వరి, పసుపు, మిరప, ఉల్లి, మునగ పంటలను పరిశీలించారు. పంటలకు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా కేవలం ఘనజీవామృతం, ద్రవజీవామృతం, కషాయాలను మాత్రమే వినియోగించాలని రైతులకు సూచించారు.
ప్రకృతి వ్యవసాయంలోని రాజీలేని సూత్రాలను రైతులు తూచా తప్పకుండా పాటించేలా క్షేత్రస్థాయి క్యాడర్ నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. అలాగే గ్రామంలోని బయో రీసెర్స్ సెంటర్ (BRC)ను పరిశీలించి, లోటుపాట్లను సరిదిద్దుకోవాలని నిర్వాహకులకు పలు సూచనలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో నేచురల్ ఫార్మింగ్ అసిస్టెంట్ (NFA) చెన్నయ్య, ఎఫ్ఎంటీలు (FMTs) చంద్రమ్మ, రవి, ఐసీఆర్‌పీలు (ICRPs) వెంకట సురేష్, ఆదిలక్ష్మి, సుజాత, రమాదేవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




