Rayachoti: జగన్ హయాంలో చేనేతకు భరోసా - కూటమి పాలనలో అన్యాయం గడికోట!

Rayachoti: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 7 Aug 2026 10:31 PM IST
Rayachoti
X

Rayachoti: జగన్ హయాంలో చేనేతకు భరోసా - కూటమి పాలనలో అన్యాయం గడికోట!

రాయచోటి: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని చేనేత కార్మికులకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలు చేనేత కుటుంబాలకు అండగా నిలిచాయని పేర్కొన్నారు.

రాయచోటి నియోజక వర్గంలో జగన్ ప్రభుత్వ హయాంలో అమలైన నేతన్న నేస్తం పథకం ద్వారా ఐదు సంవత్సరాల పాటు వరుసగా దాదాపు 400 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందారని తెలిపారు. ఒక్కో అర్హుడికి ఐదేళ్లలో కలిపి రూ.1.20 లక్షల ఆర్థిక సహాయం అందిందని గుర్తు చేశారు.

అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న సేవ పథకం కింద రాయచోటి నియోజక వర్గంలో కేవలం 190 మందికి మాత్రమే లబ్ధి పరిమితమైందని విమర్శించారు. అర్హులైన అనేక మంది చేనేత కార్మికులు పథకానికి దూరం కావడంతో తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినప్పటికీ తొలి రెండేళ్లలో ఈ పథకాన్ని అమలు చేయకుండా చేనేత కార్మికులకు ఒక్క రూపాయి కూడా అందించలేదని విమర్శించారు. జాతీయ చేనేత దినోత్సవం రోజున కూడా చేనేత కుటుంబాల్లో ఆనందం కనిపించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.ప్రభుత్వం వెంటనే చేనేత కార్మికులకు బకాయిగా ఉన్న రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని విడుదల చేయడంతో పాటు, అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న సేవ పథకాన్ని వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గతంలో సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేదని, ప్రస్తుతం ఆ పారదర్శకత కనిపించడం లేదని ఆరోపించారు. చేనేత రంగాన్ని ఆదుకోవాలంటే అర్హులందరికీ వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంస్కృతి, సంప్రదాయాలకు చిరునామాగా నిలిచిన చేనేత రంగం భారతదేశానికి గర్వకారణమన్నారు. శ్రమ, నైపుణ్యం, కళాత్మకతతో అద్భుతమైన వస్త్రాలను నేస్తూ దేశ వారసత్వాన్ని ప్రపంచానికి చాటుతున్న ప్రతి చేనేత కార్మికుడికీ శుభాకాంక్షలు తెలుపుతూ, చేనేత రంగం మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి చేనేత కుటుంబం సుఖసంతోషాలతో, ఆర్థికంగా ఎదగాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story