Proddatur: ఈ నెల 11 నుంచి 21 వరకు వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు!
Proddatur: ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి 136వ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు. ఈ నెల 11 నుండి 21 వరకు వైభవంగా వేడుకలు.
Proddatur: ఈ నెల 11 నుంచి 21 వరకు వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు!
Proddatur: దసరా ఉత్సవాల్లో రెండో మైసూర్ గా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరులో శరన్నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిశాలలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి 136వ దసరా మహోత్సవాలను ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆర్యవైశ్య సభ సిద్ధమైంది.
ఉత్సవాల వివరాలను ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్ రావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 11న ఆదివారం ఉదయం 8 గంటలకు 102 మంది ఆర్యవైశ్య సువాసినుల శోభాకలశ యాత్రతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కలశాలతో బయలుదేరే ఈ యాత్ర శివాలయంలో నవగంగ తీర్థాలను, తెల్లాకుల శివయ్యకు చెందిన నగరేశ్వరస్వామి దేవస్థానం నుంచి అమ్మవారి పురాణాన్ని స్వీకరించి అమ్మవారిశాలకు చేరుకుంటుంది.
తొలిరోజు వేడుకల్లో భాగంగా పాలకొల్లు బ్యాండ్, కర్ణాటక కళాకారుల చిలిపిలి బొమ్మల ప్రదర్శన, ప్రొద్దుటూరు ‘నృత్య తరంగిణి ఫైన్ ఆర్ట్స్’ వారి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మోడంపల్లి కవిత బృందం వారి కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఈ నెల 17వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు బిందె సేవ గ్రామోత్సవం ప్రారంభం కానుంది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనలతో పట్టణ పురవీధుల గుండా ఈ ఉత్సవం కంటిపాపలా సాగనుంది.
ఇక విజయదశమి రోజున అంటే ఈ నెల 20న మధ్యాహ్నం 3 గంటలకు శమీ దర్శనం నిర్వహించనున్నారు. రాత్రి 12:30 గంటలకు ఉత్సవాల్లోకెల్లా ప్రధానమైన ‘తొట్టి మెరువని’ కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుంది. విజయదశమి నాటి తొట్టి మెరువని ఉత్సవంలో సన్నాయి వాద్యాలు, కళాకారుల డ్రమ్స్, హైదరాబాద్‌కి చెందిన ‘రేలా రే రేలా’ బృందం జానపద ప్రదర్శనలు పండుగ శోభను రెట్టింపు చేయనున్నాయి.
వీటికి తోడు స్క్రీన్, బటర్‌ఫ్లై, డ్రోన్ ప్రదర్శనలు, సుళ్లూరుపేట మదీనా క్రాకర్స్ వారి రంగురంగుల బాణసంచా వేడుకలు, విల్లిపురం కళాకారుల ఎల్‌ఈడీ మూవింగ్ తొట్టి ప్రదర్శనలు భక్తులను అబ్బురపరచనున్నాయి. దొరసానిపల్లె శ్రీ హనుమాన్ భజన బృందం వారి చెక్కభజన కూడా ఈ ఉత్సవంలో ప్రత్యేక నిలవనుంది. ఉత్సవాల చివరి రోజైన ఈ నెల 21వ తేదీ బుధవారం ఉదయం 6:30 గంటల నుంచి అమ్మవారి దివ్య గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఎన్.ఆర్.పేటకు చెందిన తప్పెట్ల బృందం ప్రదర్శన నడుమ పురవీధుల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
ఈ దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని, అమ్మవారి కృపాకటాక్షాలు పొంది ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆర్యవైశ్య సభ ప్రతినిధులు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సభ ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ రవీంద్రబాబు, కార్యదర్శి మురికి నాగేశ్వరరావు మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




